Rythu runamafi : రుణమాఫీ చేశాం..హరీశ్ రాజీనామా చేస్తారా? : రేవంత్ రెడ్డి
రైతులకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయగలిగితే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్న మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.
- By Latha Suma Published Date - 06:11 PM, Thu - 15 August 24

Rythu runamafi: సాగుకు జీవం.. రైతుకు ఊతం పేరుతో ఖమ్మం జిల్లా వైరాలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్ రావు గురించి ప్రస్తావించారు. రైతులకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయగలిగితే రాజీనామా చేస్తానని సవాలు విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్న మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రుణమాఫీ చేయడం కుదరదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేస్తే సిద్దిపేట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గతంలో హరీశ్ రావు సవాల్ విసిరిన సందర్భాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు హరీశ్‌రావు రాజీనామా చేయాలని.. లేకుంటే తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదా హైదరాబాద్ లోని అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలని అన్నారు. అదీ కుదరకపోతే తాను విసిరిన ఛాలెంజ్‌ను వెనక్కు తీసుకుంటున్నట్టు హరీశ్ రావు చెప్పాలని డిమాండ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
వరంగల్ వేదికగా తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రూ.31వేల కోట్లతో రుణమాఫీ చేశాం. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ అడ్డా. ఖమ్మం జిల్లా రైతాంగానికి అండగా నిలిచేందుకే ఈ ప్రాంతానికి వచ్చా. 2026 పంద్రాగస్టు లోపు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రెండు పడక గదుల ఇళ్ల పేరిట కేసీఆర్ మోసం చేశారు. మేం నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు అందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం. ఆరు గ్యారంటీల అమలుకు నిరంతరం కష్టపడుతున్నాం అని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.