YS Sharmila : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది వాస్తవం : వైఎస్ షర్మిల
ఇది కొత్తగా ఎవరు రమ్మన్నా, విచారణకు హాజరవుతానని ఇప్పుడే చెబుతున్నా. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించి విచారణ వేగవంతం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు.
- By Latha Suma Published Date - 03:19 PM, Wed - 18 June 25

YS Sharmila : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం పచ్చి నిజమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, తన ఫోన్‌తో పాటు తన భర్త, సన్నిహితుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ అంశంపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దీన్ని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా నిర్ధారించారు. అప్పట్లో ఒక ట్యాపింగ్ ఆడియోను నాకే వినిపించారు. ఇది కొత్తగా ఎవరు రమ్మన్నా, విచారణకు హాజరవుతానని ఇప్పుడే చెబుతున్నా. ఈ వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించి విచారణ వేగవంతం చేయాలి అని షర్మిల డిమాండ్ చేశారు.
Read Also: Pakistan : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్
ఆ సమయంలో తనపై కుట్ర పన్నడం కోసం జగన్, కేసీఆర్ కలసి పని చేశారని ఆమె ఆరోపించారు. ఆ రోజుల్లో జగన్ కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి అది రక్తసంబంధాన్ని మించి అనిపించింది. నన్ను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయాలని ప్రయత్నించారు. ట్యాపింగ్ జరిగిన విషయాన్ని అప్పుడే బయట పెట్టకపోవడం వెనుకా కారణాలున్నాయి. ఆ సమయంలో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. వారిద్దరూ చేస్తున్న అరాచకాలు చూస్తే ట్యాపింగ్ చిన్నదిగా అనిపించేది అని వ్యాఖ్యానించారు. తాను జగన్‌కు సహోదరి అయినప్పటికీ, తన ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేసినట్లు షర్మిల ఆరోపించారు. నేను అభివృద్ధి చెందకూడదని, నా భవిష్యత్తును నాశనం చేయాలని కుట్ర పన్నారు.
నా పక్కన నిలిచిన వారిని బెదిరించారు. రాజకీయంగా నా ప్రయాణానికి అడ్డు కావాలని ప్రణాళిక వేసారు. కేసీఆర్ కోసం నన్ను అణగదొక్కాలని జగన్ ప్రయత్నించారు. నేను తెలంగాణలో పార్టీ ప్రారంభించడంలో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు తపలపడ్డారు అని ఆమె చెప్పారు. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టించాయి. షర్మిల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీపై తీవ్ర ఒత్తిడిని తీసుకురావొచ్చు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించాల్సిన అవసరం ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబుపై ఉంది. కేసీఆర్, జగన్ ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.