Kargil War – NavIC : అమెరికా నో చెబితే.. ఇండియా తయారు చేసుకున్న టెక్నాలజీ
Kargil War - NavIC : ఇతర దేశాలపై ఆధారపడకుండా.. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను సిద్ధం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్వీ–ఎఫ్12 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్–01 (NVS-01) ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
- By Pasha Published Date - 11:02 AM, Mon - 29 May 23

Kargil War – NavIC : ఇతర దేశాలపై ఆధారపడకుండా.. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను సిద్ధం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్వీ–ఎఫ్12 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్–01 (NVS-01) ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. జీఎస్‌ఎల్వీ–ఎఫ్12 రాకెట్ బయల్దేరిన 18 నిమిషాలకు ఉపగ్రహాన్ని 251 కిలోమీటర్ల ఎత్తులో జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెడుతుంది. ఎన్‌వీఎస్–01 ఉపగ్రహం మన దేశ భూభాగం చుట్టూ 1,500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైం పొజిషనింగ్ సేవలను అందించనుంది. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) పేరుతో మన దేశం అభివృద్ధి చేసిన ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో.. ఇవాళ ప్రయోగించిన “ఎన్‌వీఎస్–01” ఉపగ్రహం కూడా ఒకటి. NavICను(Kargil War – NavIC) ఇండియా ఎందుకు స్టార్ట్ చేసింది ? దీనికి కార్గిల్ వార్ తో సంబంధం ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం..
కార్గిల్ యుద్ధం .. ఇండియాకు అమెరికా నో
కార్గిల్ యుద్ధం 1999 మే 3 నుంచి జులై 26 వరకు జరిగింది. ఆ టైమ్ లో మన కార్గిల్ లోకి చొరబడిన పాకిస్తానీ సైనికుల లొకేషన్ ను ట్రాక్ చేసేందుకు భారత ప్రభుత్వం అమెరికా సహాయం కోరింది. అయితే పాకిస్తాన్ తో కూడా తమకు ఆయుధాల డీల్స్ ఉన్నందున.. ఇండియాకు GPS సపోర్ట్ ను ఇవ్వలేమని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా నోటా ఆ మాటను విన్న నాటి నుంచి.. మన దేశం సొంత నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థను డెవలప్ చేయడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే 2006 సంవత్సరంలో నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC) ను స్టార్ట్ చేసింది. NavICని ఇంతకుముందు ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (IRNSS) అని పిలిచేవారు. ఇప్పుడు ఈ నెట్‌వర్క్ ను మరింత బెటర్ చేసే టార్గెట్ తో ఇండియా ముందుకుపోతోంది. ఇందులో భాగంగానే ఎన్‌వీఎస్–01 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
ఇండియా కల నెరవేరింది..
నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (NavIC)లో భాగంగా 7 ఉపగ్రహాల కాన్స్టెలేషన్.. మన దేశంలోని గ్రౌండ్ స్టేషన్లతో కలిసి పని చేస్తుంది. IRNSS కోడ్ నేమ్ తో 2013 జులై 1 నుంచి 2017 ఆగస్టు 31 మధ్య కాలంలో ఇస్రో 7 నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో 6 సక్సెస్ ఫుల్ గా కక్ష్యలోకి చేరాయి. ఏడో నావిగేషన్ ఉపగ్రహంతో 2017 ఆగస్టు 31న నిర్వహించిన ప్రయోగం ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆ ఏడో నేవిషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఎన్‌వీఎస్–01 ఉపగ్రహాన్నిప్రయోగించారు. దీని ద్వారా సొంత నావిగేషన్ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలనే భారత్ కల సాకారమైంది.
Also read : Antarctica To Shadnagar : అంటార్కిటికా టు షాద్‌నగర్.. ఇస్రో 110 కోట్ల ప్రాజెక్ట్
NavIC అందించే సేవలు..
- స్టాండర్డ్ పొజిషన్ సర్వీస్ (SPS) అంటే సాధారణ పౌరుల లొకేషన్ సర్వీసులకు ఉద్దేశించినది.
- నియంత్రిత సేవ (RS) అంటే వ్యూహాత్మక వినియోగదారుల కోసం మాత్రమే.
NavIC ఎందుకు ఉపయోగపడుతుంది ?
- దేశంలో పౌర విమానయాన రంగానికి పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని NavIC వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ నెట్‌వర్క్ భారతదేశం, దాని సరిహద్దు నుంచి 1500 కి.మీ వరకు విస్తరించి ఉంటుంది. దీన్ని భూసంబంధమైన, వైమానిక, సముద్ర రవాణా, లొకేషన్ ఆధారిత సేవలు, వ్యక్తిగత చలనశీలత, వనరుల పర్యవేక్షణ, శాస్త్రీయ పరిశోధన కోసం ఉపయోగిస్తారు.
- నావిగేటర్ యొక్క స్థానం ఖచ్చితత్వం సాధారణ వినియోగదారులకు 5-20 మీటర్లు.. సైనిక ఉపయోగం కోసం 0.5 మీటర్లు. దాని సహాయంతో శత్రు లక్ష్యాన్ని మరింత కచ్చితత్వంతో దాడి చేసే అవకాశం ఉంటుంది.
- విమానాలు, నౌకలు, రోడ్డుపై నడిచే ప్రయాణికుల లొకేషన్స్ ను కూడా ఇది పర్ఫెక్ట్ గా ట్రాక్ చేస్తుంది. గూగుల్ లాగానే ఇందులో విజువల్ , వాయిస్ నావిగేషన్ ఫీచర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
Also read : Skyfall in Gujarat: గుజరాత్ లో ‘లోహపు’ బంతుల వర్షం.. రంగంలోకి ఇస్రో!
నావిగేషన్ కోసం ఏ దేశం ఏ టెక్నాలజీని వాడుతోంది ?
- భారతదేశం: నావిక్
- అమెరికా: GPS
- యూరప్: గెలీలియో
- రష్యా: గ్లోనాస్
- చైనా: బీడౌ
- జపాన్: QZSS
GPS ఆన్ చేస్తే ఏమవుతుందో తెలుసా ?
మీరు మొబైల్‌లోని GPS లొకేషన్ ను ఆన్ చేస్తే.. అది నేరుగా అమెరికాలోని 31 ఉపగ్రహాలకు కనెక్ట్ అవుతుంది. ఉపగ్రహం మీ స్థానాన్ని పొందుతుంది. మీరు ఉపగ్రహం నుంచి మ్యాప్‌ని పొందుతారు.Google Maps లొకేషన్ సెర్చ్ కోసం GPSని ఉపయోగిస్తుంది. ఇప్పుడు మన NavIC కూడా ఈ పని చేయగలదు.