ISRO : పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో
షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహమైన రీశాట్-1బీని నిర్దేశిత భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
- By Latha Suma Published Date - 12:17 PM, Tue - 13 May 25

ISRO : ఇస్రో నుంచి మరో కీలక ప్రయోగానికి సన్నాహాలు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ నెల 18వ తేదీన ఉదయం 6:59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ61 వాహక నౌకను ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహమైన రీశాట్-1బీని నిర్దేశిత భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.
Read Also: India Vs Kirana Hills: కిరానా హిల్స్‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్
ఈ ఉపగ్రహం ముఖ్య లక్ష్యం భూ ఉపరితలాన్ని హై-రిజల్యూషన్ చిత్రాల రూపంలో పరిశీలించడం. దీనిలో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ (సార్) ద్వారా ఏ సమయంలోనైనా, ఎలాంటి వాతావరణంలోనైనా అర్థరాత్రి అయినా, మేఘావృతమైన వాతావరణం అయినా భూమిపై ఉన్న వస్తువులను స్పష్టంగా గుర్తించగలదు. ఇది పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేసే అధునాతన రాడార్ పరికరంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం దేశానికి ఎదురవుతున్న భద్రతా సవాళ్ల నేపథ్యంలో రీశాట్-1బీ ప్రయోగం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, ఈ ఉపగ్రహం అందించే సమాచారం భారత రక్షణ దళాలకు వ్యూహాత్మకంగా ఎంతో ఉపయోగపడనుంది. ఉగ్రవాదుల కదలికలు, సరిహద్దుల్లో శత్రు సైన్యాల చలనం వంటి అంశాలను ఇది గమనించి, అత్యంత స్పష్టమైన చిత్రాలను అందించగలదు.
రీశాట్-1బీ ద్వారా సమగ్ర భద్రతా సమాచారాన్ని సమకూర్చే వీలవుతుంది. మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణ స్పందనకు కూడా ఇది తోడ్పడుతుంది. అంతేకాదు, వ్యవసాయం, అటవీ నిర్వహణ, నీటి వనరుల పర్యవేక్షణ వంటి పౌర అవసరాలకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఇస్రో చేపట్టే ఈ ప్రయోగం మరోసారి భారత అంతరిక్ష పరిశోధన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటనుంది. దేశ భద్రతతో పాటు పౌర అవసరాల కోసం కూడ ఉపయోగపడేలా రూపుదిద్దుకున్న రీశాట్-1బీ, దేశానికి ఒక కొత్త భద్రతా దృష్టికోణాన్ని అందించనుంది.
Read Also: Operation Sindoor : నేడు పలు దేశాలకు భారత్ ప్రత్యేక బ్రీఫింగ్..!