Operation Sindoor : నేడు పలు దేశాలకు భారత్ ప్రత్యేక బ్రీఫింగ్..!
ఈ సమావేశానికి యూకే సహా అనేక దేశాల రాయబారులు, రక్షణ సలహాదారులు హాజరుకానున్నారు. వీరికి ప్రత్యేకంగా సమన్లు పంపిన కేంద్రం, ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన కీలక విషయాలను వివరించే కార్యక్రమానికి సిద్ధమైంది.
- By Latha Suma Published Date - 11:40 AM, Tue - 13 May 25

Operation Sindoor : ఉగ్ర ముఠాలకు అండగా నిలుస్తూ, సీమాంతర ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తున్న పాకిస్థాన్‌పై భారత్ తీవ్రంగా స్పందించింది. దాయాదికి గట్టిగా బుద్ధి చెబుతూ కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ మిలిటరీ చర్యల ద్వారా న్యూఢిల్లీ పాక్‌కు బలమైన సందేశం పంపింది. ఈ చర్యలతో పాక్ ఉగ్ర మద్దతుకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే దిశగా భారత ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఈ క్రమంలో, మంగళవారం న్యూఢిల్లీలోని రక్షణశాఖ కార్యాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి యూకే సహా అనేక దేశాల రాయబారులు, రక్షణ సలహాదారులు హాజరుకానున్నారు. వీరికి ప్రత్యేకంగా సమన్లు పంపిన కేంద్రం, ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన కీలక విషయాలను వివరించే కార్యక్రమానికి సిద్ధమైంది.
Read Also: Terrorists Encounter : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. లష్కరే ఉగ్రవాది హతం.. మరో ముగ్గురి కోసం వేట
ఈ భేటీలో, భారత్ చేపట్టిన చర్యల వెనుక ఉన్న సాంకేతిక, భద్రతాపర, వ్యూహాత్మక అంశాలను వివరిస్తారు. ఉగ్రవాద నిర్మూలనలో భారత్ తీసుకున్న ముందడుగు, ఆపై చోటుచేసుకున్న పరిణామాలు, పాక్‌పై మిలిటరీ చర్యలకు కారణాలపై స్పష్టత ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయా దేశాల మద్దతును భారత్ కోరనుంది. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, రక్షణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఇదే సమయంలో బుధవారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం కూడా ఆపరేషన్ నేపథ్యంలో కీలకంగా మారనుంది. ఇందులో భద్రతాపర వ్యూహాలు, సైనిక స్థాయిలో తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు మే 19న జరగనున్న పార్లమెంటరీ విదేశాంగ సంఘ సమావేశంలో కూడా ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను వెల్లడి చేయనున్నారు. ఈ భేటీకి కమిటీ ఛైర్మన్ శశిథరూర్ నేతృత్వం వహించనున్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఈ సమావేశంలో సభ్యులకు పూర్తి సమాచారం అందించనున్నారు.