TDP Mahanadu : నేరస్థులు చేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న వారికి పదును పెడుతూ, క్షణిక ప్రలోభాలకు లోనవుతున్నవారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఎవరు ఎక్కడినుండి వచ్చారన్నది ముఖ్యం కాదు..
- By Latha Suma Published Date - 12:56 PM, Wed - 28 May 25

TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ మహానాడు రెండవ రోజు సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బలమైన సందేశాలను ఇచ్చారు. రాజకీయాల్లో వచ్చినవాళ్లు పోయే వాళ్లే అయినా, నిజమైన కార్యకర్త ఎప్పటికీ పార్టీతోనే ఉంటాడని స్పష్టం చేశారు. పార్టీకి అంకితభావంతో పని చేస్తున్న వారికి పదును పెడుతూ, క్షణిక ప్రలోభాలకు లోనవుతున్నవారిపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘వలస పక్షులు వస్తాయ్.. పోతాయ్.. కానీ నిజమైన కార్యకర్త శాశ్వతంగా ఉంటాడు. ఎవరు ఎక్కడినుండి వచ్చారన్నది ముఖ్యం కాదు.. వారు పార్టీ సిద్ధాంతాలకు నిజంగా నమ్మకంగా ఉన్నారా? అనే విషయమే ముఖ్యం’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Kamal Haasan : రాజ్యసభకు కమల్ హాసన్‌ను పంపిస్తాం: ఎంఎన్‌ఎం ప్రకటన
అలాగే పార్టీకి హాని కలిగించే విధంగా వ్యవహరిస్తున్న కొంతమంది కోవర్టుల గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేరస్థులూ ఖబడ్దార్.. నా దగ్గర ఎవరి ఆటలూ సాగవు. కోవర్టుల పట్ల జాగ్రత్తగా ఉండాలని కార్యకర్తలకు చెబుతున్నా. వారిచేసే కనికట్టు మాయపై అందరూ అప్రమత్తంగా ఉండాలి. కోవర్టులను పార్టీలోకి పంపాలని చూసే ప్రయత్నాలు సాగుతున్నా, అలాంటి వాళ్లకు ఇకపైన చోటు ఉండదు’’ అని హెచ్చరించారు. ఇక సోషల్ మీడియా దుష్ప్రచారాలపై కూడా చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘‘ఆడబిడ్డలపై అసభ్యంగా ప్రవర్తించే వారికి ఇదే చివరి రోజు అవుతుంది. సోషల్ మీడియాలో ఆడబిడ్డలపై దుష్ప్రచారాలు చేస్తే సహించం. మహిళల పట్ల గౌరవం ఉండాలి. అది లేకపోతే ఎవరైనా సరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’’ అని తేల్చి చెప్పారు.
వివేకానంద రెడ్డి హత్య కేసులో తనను మోసం చేసిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాపై నెపం వేసేందుకు కుట్ర చేశారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత ప్రచారం చేశారు. ఆ వార్తను నమ్మేశా. కానీ సాయంత్రానికి నిజం బయటపడింది. గొడ్డలితో దాడి చేసిన విషయం తెలిసింది. ఇంతటి ఘోరమైన హత్యను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించడం చాలా దుర్మార్గం’’ అని మండిపడ్డారు. చంద్రబాబు ప్రసంగం మొత్తం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పార్టీలో నిజాయితీ, అంకితభావం కలిగిన వారికే గౌరవం ఉంటుందని, అవినీతి, కుట్రలతో పార్టీలోకి వచ్చేవారికి తలుపులు మూసి ఉంటాయని స్పష్టం చేశారు. తాను సీఎం అయిన తర్వాత చేస్తున్న మార్పులు, పాలనను ప్రశంసిస్తూ ప్రజల మద్దతుతోనే తాను అధికారంలోకి వచ్చానని తెలిపారు.