CM Yogi Adityanath: ఆహారంలో కల్తీని ఉపేక్షించవద్దు: ఆధికారులకు సీఎం యోగి ఆదేశాలు
Uttar pradesh: దీనిపై పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో గల అన్ని ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు.
- By Latha Suma Published Date - 03:36 PM, Tue - 24 September 24

Food adulteration: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఘజియాబాద్‌లో ఓ దుకాణదారుడు జ్యూస్‌లో మూత్రాన్ని కలిపి విక్రయించినట్లు వార్తలొచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాంటి మరికొన్ని సంఘటనలు చోటు చేసుకోవడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మానవ వ్యర్థాలు, కుళ్లిన పదార్థాలను ఆహారం, పప్పు దినుసులు, పండ్ల రసాల్లో కలపడం, కల్తీకి పాల్పడటం, అక్రమ విక్రయాలు, లైసెన్సులు లేకుండా దుకాణాలను నడిపించడం వంటి ఘటనలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నారు.
Read Also: Kamareddy: ఆరేళ్ళ పాపపై పీఈటీ అసభ్య ప్రవర్తన
దీనిపై పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో గల అన్ని ధాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ఆహారంలో కల్తీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఘజియాబాద్ తరహా ఉదంతాలు చోటు చేసుకోకుండా ఉండటానికి అన్ని హోటళ్లు, ధాబాల సిబ్బందిపై నిఘా ఉంచాలని సూచించారు. యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాల కిచెన్‌లల్లో కూడా సీసీ కెమెరాలను అమర్చాలని నిర్ణయించారు అధికారులు. వంటవాళ్లు తప్పనిసరిగా గ్లోవ్స్ ధరించాల్సి ఉంటుంది. మాస్కులను ధరించడాన్ని వెయిటర్లకు తప్పనిసరి చేశారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించేలా స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్, హెల్త్, మున్సిపల్, పోలీస్ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆయా బృందాలన్నీ కూడా తరచూ మెరుపు దాడులను చేపట్టాల్సి ఉంటుంది. ధాబాలు/రెస్టారెంట్‌లు మొదలైన తినే సంస్థలను తనిఖీ చేయడం అవసరం. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని నిర్వహించడం ద్వారా, ఈ సంస్థల నిర్వాహకులతో సహా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరి ధృవీకరణ జరగాలి. ఈ చర్యను ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ మరియు స్థానిక పరిపాలన యొక్క ఉమ్మడి బృందం త్వరగా పూర్తి చేయాలి. హోటళ్ల నిర్వాహకులు, యజమానులు, తమ పేర్లు, చిరునామాల పేర్లను బోర్డుపై రాయడం తప్పనిసరి. దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టాన్ని వాళ్లు అనుసరించాల్సి ఉంటుంది. కస్టమర్లు కూర్చునే ప్రదేశాలు మాత్రమే కాకుండా కిచెన్, వంట వండే ప్రాంతం మొత్తం కవర్ అయ్యేలా సీసీటీవీలను ఏర్పాటు చేయాలి.