Pahalgam Terror Attack : ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా?: సుప్రీంకోర్టు
ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? మీక్కూడా దేశంపై బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు అని ధర్మాసనం సూచించింది. ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి.
- Author : Latha Suma
Date : 01-05-2025 - 2:31 IST
Published By : Hashtagu Telugu Desk
Pahalgam Terror Attack : సుప్రీంకోర్టులో పహల్గాం దాడి పై పిటిషన్ దాఖలైంది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాజ్యాలతో మన భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? అని కోర్టు పిటిషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలతో మన బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయాలనుకుంటున్నారా? మీక్కూడా దేశంపై బాధ్యత ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు అని ధర్మాసనం సూచించింది. ఇది చాలా క్లిష్ట సమయం. ఉగ్రవాదంపై పోరులో ప్రతి పౌరుడు చేతులు కలపాలి. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కాస్త బాధ్యతతో వ్యవహరించండి. అందులో సున్నితత్వాన్ని అర్థం చేసుకోండి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఉగ్రవాద ఘటనల విచారణకు జడ్జీలు నిపుణులు కారు అని ధర్మాసనం వెల్లడించింది. ఇలాంటి అంశాలను న్యాయ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించొద్దుని సుప్రీంకోర్టు తెలిపింది.
Read Also: Commercial cylinder : కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింపు..
అయితే ఈ వ్యాజ్యాన్ని ఇతర రాష్ట్రాల్లో కశ్మీరీ విద్యార్థుల భద్రత కోసమే తాను దాఖలు చేసినట్లు పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక సుప్రీంకోర్టు దీనిపై స్పందిస్తూ.. విద్యార్థుల కోసమే అయితే హైకోర్టులకు వెళ్లొచ్చని తెలిపింది. అదే సమయంలో విద్యార్థులకు అండగా జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ప్రస్తావించారు. పహల్గాం దాడి తర్వాత సీఎం ఒమర్ అబ్దుల్లా ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాశ్మీరీ విద్యార్థుల రక్షణ దిశగా చర్యలు తీసుకున్నారని, జమ్మూ కశ్మీర్ మంత్రులను ఇతర రాష్ట్రాల మంత్రులతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారనే విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ పిల్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. ఇది సరైన సమయం కాదు. ఇలాంటి పిల్‌లు దాఖలు చేయడం సరైన చర్య కాదు అని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కోర్టు సూచనలతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.