One Nation, One Election : అందుకే తాము ఈ బిల్లును అంగీకరించబోం : డీఎంకే ఎంపీ కనిమొళి
. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారని, కానీ మీరు వాళ్ల హక్కును దూరం చేస్తారని అనుకోవడం లేదని కనిమొళి వ్యాఖ్యానించారు.
- By Latha Suma Published Date - 05:44 PM, Tue - 17 December 24
One Nation, One Election : ఈరోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలసిందే. దాంతోపాటే బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించి జేపీసీకి అప్పగించారు. ఈ క్రమంలోనే డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ..”ఒకే దేశం, ఒకే ఎన్నిక ” బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభలో ఖరాఖండిగా చెప్పామని అన్నారు. ప్రభుత్వం ఎన్నేళ్లు ఉండాలనే అధికారాన్ని ప్రజల నుంచి లాక్కుని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వడం కరెక్ట్ కాదని అన్నారు.
అలా చేయడం రాష్ట్రాలకు, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగానికి వ్యతిరేకమని అన్నారు. ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాలను ఐదేళ్ల కాలానికి ఎన్నుకుంటారని, కానీ మీరు వాళ్ల హక్కును దూరం చేస్తారని అనుకోవడం లేదని కనిమొళి వ్యాఖ్యానించారు. కేంద్రం ఆ బిల్లును అమల్లోకి తీసుకొస్తే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విఘాతం కలుగుతుందని అన్నారు. కాబట్టి అందుకే తాము ఈ బిల్లును అంగీకరించబోమని అన్నారు.
కాగా, జమిలి ఎన్నికల బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకునేందుకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం యత్నిస్తోందని ఈసందర్భంగా విపక్ష ఎంపీలు ఆరోపించారు. ఆ బిల్లులపై సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దీంతో ప్రతిపక్షాల డిమాండ్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ అంగీకరించారు. జమిలి ఎన్నికల బిల్లులను చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు తాము సిద్ధమని ఆయన లోక్‌సభలో ప్రకటించారు. జేపీసీలో సమగ్ర చర్చ తర్వాతే ఈ బిల్లులపై తుది నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు.
Read Also: Banana: చలికాలంలో అరటిపండు తినడం మంచిదేనా?