CM Revanth Reddy : మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్
CM Revanth Reddy : ప్రధాని మోడీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు.
- By Latha Suma Published Date - 02:08 PM, Sat - 9 November 24

Maharashtra Elections : మహారాష్ట్ర ఎన్నికల స్టార్ క్యాంపెయినర్‌గా సీఎం రేవంత్ రెడ్డి ఉన్న విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీనికోసం ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో నేడు ఉదయం బయలుదేరి ముంబయి చేరకున్నారు. ఇక ముంబయిలో మహారాష్ట్ర పీసీసీ కార్యాలయంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సుక్కు, ఏఐసీసీ జాతీయ మీడియా కమిటీ చైర్మన్ పవన్ ఖేరా, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డిలతో సీఎం రేవంత్ తాజాగా సమావేశం అయ్యారు.
అనంతరం..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణలో మేమిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ గారిచే సెప్టెంబర్ 17 2023 లో మేమిచ్చిన హామీలను తెలంగాణలో అమలు చేశామన్నారు. ప్రధాని మోడీ కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోడీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. మేం నిజాలు చెబుతూనే ఉంటామన్నారు. మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై నిజాలు చెప్పడానికే ఇక్కడికి వచ్చానని… ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామని రేవంత్ రెడ్డి అన్నారు.
కాగా, మహారాష్ట్రలో నవంబర్ 20న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ సీఎంల సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఎన్నికల మేనిఫెస్టో, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్టు సమాచారం. ఈ సమావేశాల అనంతరం పలు నియోజకవర్గాల్లో రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. కాగా, ఇటీవల హర్యానా, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విఫలమైన విషయం తెలిసిందే. ఈ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు రిపీట్ అయ్యేలా కాంగ్రెస్ కూటమి ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది.