Software Couple: సంసారానికి సమయం కేటాయిస్తున్నారా.. సాఫ్ట్ వేర్ జంటకు ‘సుప్రీంకోర్టు’ ప్రశ్న!
విడాకులు మంజూరు చేయాలని కోరుతూ టెకీ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
- Author : Balu J
Date : 24-04-2023 - 12:40 IST
Published By : Hashtagu Telugu Desk
పేరుకు ఐదు అంకెల జీతం, లగ్జరీ లైఫ్, సకల సౌకర్యాలు.. సాఫ్ట్ వేర్ (Software) ఉద్యోగం అంటే ఇలాంటివీ కళ్ల ముందు కదలాడుతాయి. కానీ పైకి జీవితం రంగులమయంగా ఉన్నా.. లోలోపల ఎన్నో సమస్యలు. టార్గెట్స్, ఒత్తిళ్లు వారి నిత్య జీవితంలో భాగమవుతున్నాయి. చాలామంది ఐటీ ఉద్యోగుల (Software Couple) జీవితం సాఫీగా సాగడం లేదు. ఈ నేపథ్యంలో తమకు విడాకులు మంజూరు చేయాలని కోరుతూ టెకీ దంపతులు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను జస్టిస్ కె.ఎం.జోసెఫ్ జస్టిస్ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. దంపతుల్లో ఒకరికి రాత్రి (Night Shift) ఉద్యోగం మరొకరికి పగలు ఉద్యోగమని.. ఈ క్రమంలో ఇక సంసారానికి సమయం ఏదని ప్రశ్నించింది. దంపతులుగా కలిసి ఉండటానికి సమయం కేటాయించలేకపోతున్న మీరు మీ వివాహాన్ని నిలబెట్టుకునేందుకు మరో అవకాశం ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీసింది. ”మీకు సంసారం చేయడానికి సమయం ఎక్కడుంది? బెంగళూరులో మీరు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ఒకరిది పగలు ఉద్యోగమైతే.. మరొకరిది రాత్రి ఉద్యోగం. దీంతో సంసారానికి మీకు సమయం చిక్కడం లేదు.
విడాకులు (Divorce) తీసుకోవడానికి మొగ్గు చూపుతున్న మీరు పెళ్లితో ఏర్పడిన బంధాన్ని నిలుపుకోవడానికి రెండో అవకాశం ఎందుకు తీసుకోకూడదు” అని ప్రశ్నించింది. ”తిరిగి కలిసుండేందుకు ఈ జంటకు ఓ అవకాశం ఇవ్వాలి. బెంగుళూరు అంత తరచుగా విడాకులు జరిగే ప్రదేశం కాదు. దంపతులు తమ కలయికకు అవకాశం ఇవ్వవచ్చు” అని జస్టిస్ నాగరత్న వారి తరఫున న్యాయవాదులకు సూచించారు. ఇప్పటికే ఈ విషయంలో దంపతులిద్దరూ ఓ ఒప్పందానికి వచ్చారని ధర్మాసనానికి నివేదించారు. ప్రస్తుతం ఈ ఇష్యూ టెకీల జీవితాలకు ఉదాహరణగా నిలుస్తోంది. ఇక చిన్న చిన్న సమస్యలకే ఐటీ ఉద్యోగులు విడాకులు కోరుతున్నట్టు పలు సర్వేల్లో తేలింది కూడా.
Also Read: Virat Kohli Flying Kiss: ఎంత ఘాటు ప్రేమయో.. భార్య అనుష్కకు కోహ్లీ ఫ్లైయింగ్ కిస్సులు!