Tragic Fire: మధ్యప్రదేశ్ లో దారుణం.. ప్రేమకు ఒప్పుకోలేదని ఆమె అపార్ట్ మెంట్ కు ఉన్మాది నిప్పు.. 9 మంది సజీవదహనం
వాడు ప్రేమికుడు కాదు.. సైకోలా మారిపోయాడు. ప్రేమించిన అమ్మాయి ఓకే చెప్పలేదని.. ఏకంగా ఆమె నివసిస్తున్న ఇంటికే నిప్పెట్టేశాడు.
- By Hashtag U Published Date - 10:53 AM, Sun - 8 May 22

వాడు ప్రేమికుడు కాదు.. సైకోలా మారిపోయాడు. ప్రేమించిన అమ్మాయి ఓకే చెప్పలేదని.. ఏకంగా ఆమె నివసిస్తున్న ఇంటికే నిప్పెట్టేశాడు. మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఆ యువకుడి పేరు సంజయ్ అలియాస్ శుభం దీక్షిత్. వాడు చేసిన పనికి.. ఆ భవనంలో ఉన్న మిగతా ఫ్లాట్లలోనూ నిప్పంటుకుంది. దీనివల్ల తొమ్మిది మంది మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు.
మరో 9 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జరిగిన ఈ ఘటన మధ్యప్రదేశ్ మొత్తం ఉలిక్కిపడేలా చేసింది. ఇండోర్ లో రద్దీగా ఉండే విజయ్ నగర్ ఏరియాలో ఈ ఘటన జరగడంతో నష్టం ఇంత తీవ్రంగా ఉంది. అసలీ ఘటనకు కారణాలు ఏమిటా అని పోలీసులు శోధిస్తే సంజయ్ చేసిన దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. దీనికోసం ఏకంగా 50 సీసీటీవీల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు.
సంజయ్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి అతడి ప్రేమకు ఒప్పుకోలేదు. దీంతో సంజయ్ ఒక్కసారిగా పిచ్చోడిలా మారిపోయాడు. ఉన్మాదిలా ప్రవర్తించాడు. అందుకే తనకు దక్కని ఆ అమ్మాయి వేరే ఎవరికీ దక్కకూడదని భావించి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ముందుగా ఆ అమ్మాయి ఉండే భవనం దగ్గరకు వెళ్లాడు. అక్కడ పార్కింగ్ లో ఉన్న ఓ స్కూటర్ పెట్రోల్ ట్యాంకులో నిప్పు పెట్టాడు. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.
స్కూటర్ నుంచి వ్యాపించిన మంటలు ఆ పార్కింగ్ ఏరియా మొత్తం అలుముకున్నాయి. క్షణాల్లో భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. సంఘటన జరిగింది తెల్లవారుజామున కావడంతో ఆ సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. దీంతో మంటలను వారు గమనించలేకపోయారు. కానీ అప్పటికే ఫ్లాట్లలో పొగ దట్టంగా అలుముకుంది. ఈ దెబ్బకు నివాసముంటున్నవారికి ఊపిరి ఆడలేదు. పైగా మంటలు వేగంగా పించడంతో వాటిలో చిక్కుకున్నారు. తప్పించుకునే దారిలేక నరకయాతన పడ్డారు. అక్కడికీ కొందరు తెగించి బాల్కనీలు, కిటికీల్లోంచి కిందకు దూకేశారు. దీంతో వీరందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
తన ప్రేయసిని చంపడానికి ప్లాన్ చేసిన సంజయ్.. స్కూటర్ కి నిప్పు పెట్టిన వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ సీసీటీవీల్లో ఇదంతా రికార్డ్ అయ్యుంటుందని భావించి ఓ గంట తరువాత మళ్లీ అక్కడికి వచ్చాడు. అక్కడున్న సీసీటీవీలను నాశనం చేయడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాకపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. సంజయ్ ప్రేమించిన ఆ అమ్మాయి ప్రస్తుతానికి సురక్షితంగా ఉంది. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Related News

Crime: రీఛార్జ్ చేయలేదని కుమారుడు ఆత్మహత్య
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.