Manipur Migrations : హింసాకాండతో భయభ్రాంతులు.. మణిపూర్ నుంచి మిజోరాంకు 5,800 మంది వలస
మణిపూర్ హింసాకాండ లో ఎన్నో ఊళ్లు తగలబడిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ అల్లర్లతో భయభ్రాంతులకు గురైన 5,800 మందికిపైగా ప్రజలు మణిపూర్ నుంచి మిజోరాంకు వలస (Manipur Migrations) వెళ్లిపోయారు.
- By Pasha Published Date - 11:09 AM, Mon - 15 May 23

మణిపూర్ హింసాకాండ లో ఎన్నో ఊళ్లు తగలబడిపోయాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ అల్లర్లతో భయభ్రాంతులకు గురైన 5,800 మందికిపైగా ప్రజలు మణిపూర్ నుంచి మిజోరాంకు వలస (Manipur Migrations) వెళ్లిపోయారు. వీళ్లంతా మిజోరాంలోని 6 జిల్లాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లాలో అత్యధికంగా 2021 మంది ఆశ్రయం పొందుతుండగా.. కొలాసిబ్ జిల్లాలో 1,847 మంది, సైచువల్ జిల్లాలో 1,790 మంది ఉన్నారు. వలస (Manipur Migrations) వెళ్లిన వారిలో ఎక్కువ మంది చిన్, కుకి, మిజో తెగలకు చెందివారే. మణిపూర్ లో పరిస్థితులు సద్దుమణిగాక తిరిగి తమతమ ఊళ్లకు వెళ్లాలని వారు భావిస్తున్నారు.
also read : 214 Students: మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్ కు 214 మంది తెలుగు విద్యార్థులు!
మణిపూర్ ప్రభుత్వంలో ఆదివాసీలు ఇకపై ఉండలేరని..
మరోవైపు మణిపూర్ లోని గిరిజన ప్రాంతానికి ప్రత్యేక పరిపాలన ప్రతిపత్తి కల్పించాలని ఆ రాష్ట్రానికి చెందిన 10 మంది కుకీ గిరిజన తెగ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. మణిపూర్ ప్రభుత్వంలో ఆదివాసీ ప్రజలు ఇకపై ఉండలేరని వారు అంటున్నారు. మైతీ కమ్యూనిటీకి ఎస్టీ హోదా కల్పిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగాయి. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కుకీ గ్రామస్తులను తొలగించడంపైనా నిరసనలు వెల్లువెత్తాయి. మణిపూర్ జనాభాలో మైతీలు 53 శాతం ఉన్నారు. వీళ్ళు ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు, నాగాలు, కుకీలు రాష్ట్ర జనాభాలో 40 శాతం ఉన్నారు. వీరంతా కొండ ప్రాంతాలలోని జిల్లాలలో నివసిస్తున్నారు.మైతీలు, గిరిజనులకు మధ్య పరస్సర దాడులు పెరగడం వల్లే మణిపూర్ నుంచి చాలా మంది వలసబాట పట్టారు.