Wood Treadmill: కేటీఆర్‌ను ఫిదా చేసిన చెక్క ట్రెడ్ మిల్‌ను తయారుచేసిందెవరో తెలిసిపోయిందోచ్
- By hashtagu Published Date - 09:43 AM, Mon - 21 March 22

దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూడగలడు.. ఇది ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్. నిజమే.. బుర్రంటే ఎడారిలో కూడా ఇసకను అమ్మేయొచ్చు. ఇక రూపాయి పెట్టి కొనాల్సిన వస్తువును అర్థరూపాయికే తయారుచేసుకోగలిగితే అంతకన్నా కావలసింది ఏముంటుంది? కడిపు శ్రీనివాస్ చేసింది అదే. అందుకే ఆయన టాలెంట్ కు ఏకంగా తెలంగాణ మంత్రి కేటీఆరే ఫిదా అయ్యారు. ఆయనకు ఆర్థికంగా సహాయం కూడా అందించాలనుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడ ఉన్నారో కనిపెట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు ఆయన ఎవరో, ఎక్కడివారో ఈ లోకానికి తెలిసిపోయింది.
ఆరోగ్యం కోసం నడక చాలా మంచిది. కానీ బయటకు వెళ్లి వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయలేనివారికి ఇంట్లోనే చేసుకునే వెసులుబాటు కల్పించేదే ట్రెడ్ మిల్. కాకపోతే దీనిని కొనాలంటే కనీసం రూ.25 వేలయినా పెట్టాలి. అందులో ఉన్న సదుపాయాలను బట్టి రేటు మారిపోతుంది. దీంతో అంత ధర పెట్టి దానిని కొనలేక చాలామంది ఆగిపోతారు. దానివల్ల వారికి ఆరోగ్య సమస్యలు తప్పవు. అందుకే అలాంటివారికి తక్కువ ధరలోనే ట్రెడ్ మిల్ తయారు చేయాలనే ఆలోచనలోంచే పుట్టిందే ఈ చెక్క ట్రెడ్ మిల్. అందుకే దీనిని తయారుచేశారు కడిపు శ్రీనివాస్.
కడిపు శ్రీనివాస్ ది తూర్పుగోదావరి జిల్లా మండపేట. వృత్తిరీత్యా ఆయన వడ్రంగి కళాకారుడు. అందుకే ఆయనకు చెక్కతో ట్రెడ్ మిల్ తయారుచేయడం సులభమైంది. రోజువారీ పనికి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. రోజూ ఉదయం పూట తన పనిచేసుకుంటూ రాత్రివేళలో ట్రెడ్ మిల్ వర్క్ చేసుకునేవారు. అందుకే దీని తయారీకి మూడు రోజుల సమయం పట్టింది. దీనికోసం ముందుగానే టేకు చెక్కలను సిద్ధం చేసుకోవడం వల్ల పని సులభమైంది.
ట్రెడ్ మిల్ తిరగడం కోసం 60 బాల్ బేరింగ్ లను ఉపయోగించారు. టేకు చెక్క, ఈ బేరింగులు.. ఇలా మొత్తం అన్ని ఖర్చులు కలుపుకుని.. దీని తయారీకి రూ.12 వేలు ఖర్చయ్యింది. ఎలాగూ ఇంత కష్టపడి చేసిన దానిని పదిమందీ చూస్తే.. వారు కూడా స్ఫూర్తి పొందుతారని భావించారు. అందుకే దీని పనితీరులా ఉందో వివరిస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది కాస్తా వైరల్ అయ్యి తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది.
ఈ ట్రెడ్ మిల్ ను తయారుచేసిన కళాకారుడిని గుర్తించి.. సాయం అందించాలని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ కూడా వైరల్ అయ్యింది. అక్కడి నుంచి తెలంగాణ అధికారులతోపాటు మంత్రులు కూడా ఈ ట్రెడ్ మిల్ తయారీదారుడి గురించి వాకబు చేయడం మొదలుపెట్టారు. మొత్తానికి ఆయన ఆచూకీ లభించింది. తెలంగాణ మంత్రులు కొంతమంది ఫోన్ చేసి.. ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఔత్సాహిక కళాకారులకు సాయం చేస్తూ ప్రోత్సాహాన్ని ఇవ్వడం ద్వారా మరిన్ని ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది.