BRS : కవిత పై దుష్ప్రచారం చేస్తున్న సొంత పార్టీ నేతలు ఎవరు..?
BRS : బీఆర్‌ఎస్‌లో కవితకు మద్దతు లేకుండా చేయాలని పలువురు నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
- By Sudheer Published Date - 04:32 PM, Mon - 12 May 25

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) చేసిన తాజా వ్యాఖ్యలు బీఆర్‌ఎస్ (BRS) పార్టీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. “ఆర్నేళ్లు జైల్లో ఉన్నది చాలదా? ఇంకా నన్ను కష్టపెడతారా?” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆత్మవేదనతో పాటు పార్టీపై తీవ్ర అసంతృప్తిని వెల్లడి చేస్తున్నట్టు తెలుస్తోంది. కవిత తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి బాధితురాలిగా మారారని, ఆ దుష్ప్రచారం కొందరు సొంత పార్టీయే నేతల నుంచే వస్తుందని పరోక్షంగా పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారని, గులాబీ జెండా నీడకాకుండా, తన తెలంగాణ జాగృతి ద్వారా బలమైన ప్రజా మద్దతును సంపాదించేందుకు కవిత కృషి చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
బీఆర్‌ఎస్‌లో కవితకు మద్దతు లేకుండా చేయాలని పలువురు నాయకులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఫూలే విగ్రహ స్థాపన, బీసీ వాయిస్, సామాజిక తెలంగాణ వంటి అంశాలను లేవనెత్తుతూ కవిత తన రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఇవే అంశాలు పార్టీకి అసౌకర్యంగా మారుతున్నాయి. “పదేళ్లపాటు కేసీఆర్ సీఎం అయ్యారు. అప్పుడే ఎందుకు ఫూలే విగ్రహం వేయలేదు?” అనే ప్రశ్నలు గులాబీ పార్టీలో వెలువడుతున్నాయి. పైగా కుటుంబ సర్వేలో కూడా కవిత మాత్రమే తమ డేటా ఇవ్వగా, మిగిలిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులు సహకరించకపోవడం కుటుంబంలో చీలికలకు సంకేతంగా మారింది.
Operation Sindoor : నెక్స్ట్ మిషన్‌కు భారత్ సిద్ధం – డీజీఎంవో
ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ మూడు ముక్కలు, నాలుగు చెక్కలుగా మారబోతోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కేటీఆర్ కవితను, హరీష్ రావును పార్టీ నుంచి బయటకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గతంలో విజయశాంతి, ఆలే నరేంద్రలతో జరిగిన పరిణామాలే ఇప్పుడు కవితపై కూడా జరుగుతాయంటూ హెచ్చరించారు. కవితపై వ్యతిరేకత, గౌరవాభావమే ఆమెను ఇలా బహిరంగంగా స్పందించేందుకు దారితీసిందని అన్నారు. దీనితో అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ పోరు నెమ్మదిగా ముదిరుతోందని, ఇది బీఆర్‌ఎస్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.