CM Revanth : మంత్రి పదవుల అంశంలో నోరుపారేసుకుంటే.. ఊరుకోం : సీఎం రేవంత్
మంత్రి పదవుల అంశంలో పార్టీ గీత దాటాలే మాట్లాడితే ఊరుకునేది లేదని రేవంత్(CM Revanth) వార్నింగ్ ఇచ్చారు.
- By Pasha Published Date - 03:37 PM, Tue - 15 April 25

CM Revanth : మంత్రి పదవుల కేటాయింపు అంశంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానానిదే తుది నిర్ణయం అని ఆయన తేల్చి చెప్పారు. దీనిపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం ఉండదన్నారు. మంత్రి పదవుల అంశంలో పార్టీ గీత దాటాలే మాట్లాడితే ఊరుకునేది లేదని రేవంత్(CM Revanth) వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) సమావేశం వేదికగా సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించాలని చూస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన తేల్చి చెప్పారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందన్నారు. ఇక ఈరోజు సీఎల్పీ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
Also Read :YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. సునీత వినతికి ‘సుప్రీం’ అంగీకారం
మంత్రి పదవుల కోసం రేసు
- రాష్ట్ర మంత్రి మండలిలో 6 ఖాళీలు ఉండగా, ఆశావహులు డజన్లలో ఉన్నారు.
- మంత్రి పదవుల కేటాయింపులో తమకు అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి, వివేక్ వెంకటస్వామి కోరుతున్నారు.
- మంత్రివర్గ విస్తరణ విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య ఏర్పడిన విభేదాలు వరుస పెట్టి బయటపడుతున్నాయి.
- ఆదివారం రోజు సీనియర్ నేత జానారెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు.
- సోమవారం రోజు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి లక్ష్యంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆరోపణలు చేశారు.
- తనకు మంత్రి పదవి రాకపోతే దేనికైనా సిద్ధమేనని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు కాంగ్రెస్ అధిష్ఠానాన్ని హెచ్చరించారు. ఇక రేవంత్ ఆహ్వానిస్తేనే తాను మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని వివేక్ అంటున్నారు. తనకు మంత్రి పదవిపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెబుతున్నారు.
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం రేవంత్‌కు సన్నిహితుడైన ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కోరుతున్నారు. ‘‘రాష్ట్ర జనాభాలో సగం మంది హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉంటారు. ఆ రెండు జిల్లాల నుంచి శాసనసభకు ఎన్నికైన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి’’ అని చామల డిమాండ్ చేశారు.