CM Revanth Reddy: కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా సాధిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ అక్రమంగా నీటిని మళ్లించడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ఉందని, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తుకు విఘాతం కలుగుతోందని ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలని చెప్పారు.
- By Gopichand Published Date - 10:00 PM, Sat - 13 September 25

CM Revanth Reddy: కృష్ణా నదీ జలాల వివాదంలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. కృష్ణాలో నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాలతో సహా.. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క నీరు కూడా వదులుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ విచారణలో తెలంగాణ తన తుది వాదనలు వినిపించాల్సి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శనివారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
904 టీఎంసీల కోసం పోరాటం
తెలంగాణకు కృష్ణా జలాల్లో 904 టీఎంసీల నీటి వాటా సాధించుకునేందుకు పట్టుబట్టాలని ముఖ్యమంత్రి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. దీనికి అవసరమైన అన్ని ఆధారాలను వెంటనే సిద్ధం చేసి న్యాయ నిపుణులకు అందించాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని సూచించారు. స్వయంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని సీఎం తెలిపారు.
Also Read: Jubilee Hills Voters: జూబ్లీహిల్స్‌లోని ఓటర్లకు అలర్ట్.. ఈనెల 17 వరకు ఛాన్స్!
గత ప్రభుత్వ వైఫల్యాలు
సమావేశంలో గత పదేళ్లలో కృష్ణా జలాల విషయంలో జరిగిన అన్యాయంపై చర్చ జరిగింది. గత ప్రభుత్వం ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టి, తెలంగాణకు 299 టీఎంసీల వాటాకు ఒప్పుకోవడం వల్ల తీరని అన్యాయం జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ విషయాన్ని ఏపీ ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు ప్రస్తావిస్తోందని న్యాయ నిపుణులు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకుపోయిందని, ఈ విషయాన్ని ఆధారాలతో సహా ట్రిబ్యునల్ ముందుంచాలని సీఎం ఆదేశించారు.
ఏపీ అక్రమ తరలింపులు, తెలంగాణ వాదనలు
- శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రోజుకు పది టీఎంసీల నీటిని తరలిస్తోందని, ఇతర బేసిన్లకు మళ్లిస్తోందని సీఎం అన్నారు. పట్టిసీమ, పులిచింతల, చింతలపాడు వరకు ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలను ఆధారాలతో సహా ట్రిబ్యునల్‌కు నివేదించాలని ఆదేశించారు.
- ఏపీ అక్రమంగా నీటిని మళ్లించడం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూతపడే ప్రమాదం ఉందని, తక్కువ ఖర్చుతో ఉత్పత్తి అయ్యే జల విద్యుత్తుకు విఘాతం కలుగుతోందని ఈ విషయాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలని చెప్పారు.
- తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి, దానికి రావాల్సిన హక్కులు, నీటి వాటాలు అన్ని అర్హతలతో ఉన్నాయని సీఎం అన్నారు. సాగునీటి, తాగునీటి అవసరాలతో పాటు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. గతంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లనే తెలంగాణకు కృష్ణా జలాలను వినియోగించుకోలేకపోయిందని గుర్తు చేయాలని సూచించారు.