Congress: ఢిల్లీకి చేరిన వరంగల్ జిల్లా కాంగ్రెస్ పంచాయితీ!?
వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా దంపతులు వర్సెస్ ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి వర్గాల మధ్య పోరు ఢిల్లీకి చేరడంతో పార్టీ అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
- By Gopichand Published Date - 12:25 PM, Sat - 11 October 25

Congress: వరంగల్ జిల్లా కాంగ్రెస్ (Congress) రాజకీయాలు అంతర్గత పోరుతో అట్టుడికిపోతున్నాయి. తాజాగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు నేరుగా కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం మితిమీరిందని, ఆయన పెత్తనం కారణంగా తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కొండా మురళి ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ దంపతులు చాలా కాలంగా పొంగులేటి వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారు.
మేడారం టెండర్లపై ప్రధాన అభ్యంతరం
కొండా మురళి ఫిర్యాదులో ప్రధానంగా మేడారం పనుల వ్యవహారాలు కీలకంగా మారాయి. మేడారం జాతర పనుల టెండర్లను పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సొంత కంపెనీలకు ఇచ్చుకున్నారని, ఈ వ్యవహారంలో పారదర్శకత లేదని ఆయన ఖర్గేకు వివరించారు. ఈ అంశంపై కొండా మురళీధర్‌రావు ఫోన్‌లో ఖర్గేతో మాట్లాడి, జిల్లాలో జరుగుతున్న రాజకీయ అంశాలను సమగ్రంగా తెలియజేశారు.
Also Read: Deepika Padukone: దీపికా పదుకోణెకు అరుదైన గౌరవం.. మానసిక ఆరోగ్య రాయబారిగా బాలీవుడ్ హీరోయిన్!
హైకమాండ్‌కు కొండా దంపతుల నివేదన
ఖర్గేతో పాటు కొండా దంపతులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు కూడా మేడారం పనుల వ్యవహారాలు, వరంగల్ జిల్లా రాజకీయాల్లో పొంగులేటి వల్ల తాము పడుతున్న ఇబ్బందులను నివేదించారు. “తమ జిల్లాలో… తన శాఖలో ఆయన పెత్తనం ఏంటి?” అని కొండా సురేఖ తన అసంతృప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఈ ఫిర్యాదులపై హైకమాండ్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు కొండా దంపతులు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో పట్టున్న కొండా దంపతులు వర్సెస్ ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి వర్గాల మధ్య పోరు ఢిల్లీకి చేరడంతో పార్టీ అధిష్ఠానం ఈ వ్యవహారాన్ని ఎలా చక్కబెడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంతర్గత విభేదాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు తలనొప్పిగా మారాయి.