Vice President: తెలంగాణకు ఉపరాష్ట్రపతి పదవి?!
దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం కూడా ముగిసిపోయిందన్నారు. బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు.
- By Gopichand Published Date - 08:40 PM, Wed - 23 July 25

Vice President: కేంద్ర ప్రభుత్వం ముందు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త డిమాండ్ చేశారు. ఉపరాష్ట్రపతి (Vice President) పదవిని తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇస్తే బాగుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. జులై 21న ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ అనారోగ్య కారణాల వలన రాజీనామా చేశారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాకు కారణాలేమిటో తనకు తెలియదని, కానీ ఆ రాజీనామా దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉప రాష్ట్రపతి పదవిని ఈసారి తెలంగాణకు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉప రాష్ట్రపతిగా ఉన్న తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడును రాష్ట్రపతి కాకుండా ఇంటికి పంపించారని, సికింద్రాబాద్ నుంచి గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్న బీసీ నేత దత్తాత్రేయను గవర్నర్‌గా పంపి ఆ పదవిని కిషన్ రెడ్డికి ఇచ్చారని సీఎం అన్నారు. బీసీ నేతగా ఉన్న సంజయ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి కిషన్ రెడ్డికి, ఆయన తర్వాత రాంచందర్‌రావుకు ఇచ్చారని, బీజేపీ బీసీలకు అన్యాయం చేసిందని సీఎం విమర్శించారు.
Also Read: Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!
దత్తాత్రేయ గవర్నర్ పదవీ కాలం కూడా ముగిసిపోయిందన్నారు. బీసీలకు చేసిన ఈ అన్యాయాన్ని సరిచేసుకునేందుకు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే బాగుంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే ఉప రాష్ట్రపతి ఎన్నికలో అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని, తనను అవకాశం ఉంటే దత్తాత్రేయకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రయత్నం చేస్తానని సీఎం ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసే విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నామని మరో ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి బదులిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలు) షబ్బీర్ అలీ, హర్కార వేణుగోపాల రావు (ప్రొటోకాల్, ప్రజా సంబంధాలు), ఎంపీలు డాక్టర్ మల్లు రవి, చామల కిరణ్ కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురామిరెడ్డి, పోరిక బలరాం నాయక్, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ కృష్ణ, డాక్టర్ కడియం కావ్య, సురేశ్ షెట్కార్, అనిల్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.