Bandi Sanjay Comments: ముస్లింలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి యావత్ హిందూ సమాజాన్నే దెబ్బతీసే ఘోరమైన కుట్ర జరుగుతోంది. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?
- By Gopichand Published Date - 07:54 PM, Sat - 8 February 25

Bandi Sanjay Comments: బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు (Bandi Sanjay Comments) చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వల్ల భవిష్యత్తులో తెలంగాణలోని బీసీలో పోటీ చేసే స్థానాల్లో హిందూ సమాజం గెలిచే పరిస్థితి ఉండబోదని హెచ్చరించారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లింలు గెలిచారన్నారు.
‘‘ఒకవైపు కుల గణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారు. ఇంకోవైపు బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి యావత్ హిందూ సమాజాన్నే దెబ్బతీసే ఘోరమైన కుట్ర జరుగుతోంది. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు? వాళ్ల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి?’’అని మండిపడ్డారు. మేధావులు, పట్టభద్రులు ఈ విషయంలో మౌనంగా ఉండటం సమాజానికే అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణ పాఠం చెప్పాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మోసకారి కాంగ్రెస్ కు ఢిల్లీ ప్రజలు గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చి తగిన బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు.
Also Read: PF Interest Rate: మరో భారీ ప్రకటనకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సాయంత్రం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని రాంనగర్ చౌరస్తా నుండి గీతాభవన్ చౌరస్తా వరకు ‘‘పట్టభద్రుల సంకల్ప యాత్ర’’ నిర్వహించారు. ఈ యాత్రకు భారీ ఎత్తున యువకులు, ఉద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ యాత్రకు బండి సంజయ్ తోపాటు మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఉమ్మడి మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను బండి సంజయ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో కాంగ్రెస్ కు ఏం మిగిలింది. ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు ఇచ్చింది గాడిద గుడ్డు. ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చేది గాడిద గుడ్డే. నిరుద్యోగ భృతి 4 వేల రూపాయలిస్తామన్నారు. 14 నెలలైంది. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికి 56 వేల రూపాయలు బాకీ పడింది. ఒక్కరికైనా నయాపైసా ఇచ్చారా? ఏమిచ్చారు గాడిద గుడ్డు? ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేస్తే 50 వేలు, పీజీ చేస్తే లక్ష రూపాయలిస్తామన్నారు. నయాపైసా సాయం చేశారా? ఈ లెక్కన ప్రతి విద్యార్ధికి 5 లక్షల రూపాయల బాకీ పడ్డరు. కానీ ఏమిచ్చారు.. గాడిద గుడ్డు ఇచ్చారని మండిపడ్డారు.