హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
- Author : Vamsi Chowdary Korata
Date : 06-01-2026 - 10:56 IST
Published By : Hashtagu Telugu Desk
Largest Steel Bridge హైదరాబాద్‌లో త్వరలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి రానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు రూ.4,263 కోట్లతో 18.15 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 11.52 కి.మీ. స్టీల్ బ్రిడ్జి, ఆపై అండర్ గ్రౌండ్ టన్నెల్ తో పాటు, సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు మార్గం సుగమం కానుంది. మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 2 నెలల్లో పనులు ప్రారంభం కానున్నాయి.
- నగరంలో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
- రూ.4,263 కోట్లతో నిర్మిస్తోన్న హెచ్ఎండీఏ
- ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు నిర్మాణం
హైదరాబాద్ నగరంలో త్వరలోనే అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సుమారు రూ. 4,263 కోట్ల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తీరుతాయి. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మొత్తం 18.15 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో.. 11.52 కిలోమీటర్ల మేర స్టీల్ బ్రిడ్జి రానుంది. ఆ తర్వాత హకీంపేట వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మిస్తారు.
ప్రస్తుతం నగరంలో ఒక స్టీల్ బ్రిడ్జి ఉంది. ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు జీహెచ్ఎంసీ అధికారులు దీన్ని నిర్మించారు. ఈక్రమంలో హెచ్ఎండీఏ (HMDA) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ 2 ను స్టీల్ బ్రిడ్జిగా నిర్మించాలని నిర్ణయించారు. దీని నిర్మాణం పూర్తయితే.. ఇది నగరంలోనే అతిపెద్ద స్టీల్ బ్రిడ్జిగా నిలవనుంది. హెచ్‌ఎండీఏ చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి డెయిరీ ఫామ్ వరకు 5.18 కి.మీ. ఎలివేటెడ్ కారిడార్– 1 నిర్మాణాన్ని ప్రారంభించారు. రెండో ఎలివేటెడ్ కారిడార్-2ను త్వరలో ప్రారంభించనున్నారు.
కారిడార్-2 నిర్మాణానికి సంబంధించిన అధికారులు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం మొత్తం 192 ఎకరాల భూమిని సేకరించనున్నారు. దీనిలో 114.50 ఎకరాలు రక్షణ శాఖ భూములు కాగా.. మిగిలిన భూమి ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు 967 నిర్మాణాలను తొలగించనున్నారు.
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే.. నగరవాసులు సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వరకు, అక్కడి నుంచి రాజీవ్ రహదారికి వెళ్లడం మరింత సులువు అవుతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నిత్యం భారీ ట్రాఫిక్‌తో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్, సిద్ధిపేట, గజ్వేల్ వెళ్లే రహదారిలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్‌లు నిర్మిస్తోంది. ఇప్పటికే భూసేకరణ కసరత్తు పూర్తి చేశారు.
ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో రెండు నెలల్లో పనులు ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితే ఎన్‌హెచ్-44 రూట్‌లో ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయని అధికారులు వెల్లడించారు.