రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం.
- Author : Gopichand
Date : 13-01-2026 - 3:47 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: పంట చేతికొచ్చే పండుగ వేళ మన తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో ఒక అపూర్వమైన, చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. ఇది కేవలం గణాంకం మాత్రమే కాదు మన ప్రభుత్వం రైతు సంక్షేమం పట్ల చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనం.
రికార్డు స్థాయి ధాన్యం సేకరణ
ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం 70.82 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించి సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును మనం ఇప్పుడు అధిగమించాము. దేశంలోనే మరే రాష్ట్రం సాధించని విధంగా, అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Also Read: జిల్లాల పునర్విభజన అనేది ఇప్పుడు సాధ్యం కాదా?
రైతులకు లబ్ధి- ఆర్థిక భరోసా
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ భారీ సేకరణ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరింది. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందించాలనే సంకల్పంతో కనీస మద్దతు ధర కింద రూ. 16,606 కోట్లు చెల్లించాము. రైతులకు మరింత అండగా ఉండేందుకు మరో రూ. 1,425 కోట్లను బోనస్ రూపంలో అందించామని వివరించారు.
సమృద్ధి- కృతజ్ఞత
మంత్రి ఇంకా మాట్లాడుతూ.. సంక్రాంతి అంటేనే పంటలు ఇంటికి వచ్చే పండుగ, సిరిసంపదలు వెల్లివిరిసే సమయం. మన అన్నదాతల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యం. ధాన్యం సేకరణలో మనం సాధించిన ఈ అద్భుత విజయం తెలంగాణ రైతాంగం కష్టానికి, ప్రభుత్వ పారదర్శక విధానాలకు దక్కిన గౌరవం అని చెప్పారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా, తెలంగాణను దేశానికే అన్నపూర్ణగా నిలబెట్టే దిశగా మనం వేస్తున్న ఈ అడుగులు మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నానని మంత్రి ఆకాంక్షించారు. ఈ సంక్రాంతి ప్రతి రైతు ఇంట్లో సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని నింపాలని మనసారా ఆకాంక్షిస్తున్నానని, రైతు సంక్షేమమే మన బాట – తెలంగాణ ప్రగతి మన లక్ష్యం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.