Smita Sabharwal : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్మితా సబర్వాల్ రియాక్షన్
కొండా సురేఖ కామెంట్స్‌ను ఓ వైపు టాలీవుడ్ ఖండిస్తుండగా మరోవైపు స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కూడా రియాక్ట్ అయ్యారు.
- By Pasha Published Date - 12:30 PM, Thu - 3 October 24

Smita Sabharwal : సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. కొండా సురేఖ కామెంట్స్‌ను ఓ వైపు టాలీవుడ్ ఖండిస్తుండగా మరోవైపు స్మితా సబర్వాల్ (Smita Sabharwal) కూడా రియాక్ట్ అయ్యారు. ‘‘కేవలం ప్రజల దృష్టిని ఆకట్టుకునేందుకు ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు. సంచలనాత్మకంగా మారేందుకు మహిళలను టార్గెట్‌గా ఎంచుకోవడం బాధ కలిగించే అంశం’’ అని స్మితా అభిప్రాయపడ్డారు. ‘‘చివరకు అధికారులను కూడా వదిలిపెట్టడం లేదు. వ్యక్తిగత అనుభవంతో నేను ఈ వ్యాఖ్యలు చేస్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. ‘‘మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు నాకు షాక్ కలిగించాయి. సాటి మహిళగా నాకు ఆ మాటలు గౌరవప్రదంగా అనిపించలేదు. ప్రతీ అంశాన్ని రాజకీయం చేయాలని భావించడం మంచిది కాదు’’ అని స్మితా సూచించారు. ‘‘ప్రజా జీవితంలో ఉండే వాళ్లు సరిగ్గా, గౌరవప్రదంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది’’ అని ఆమె పేర్కొన్నారు. మహిళలు, కుటుంబాలు, సామాజిక కట్టుబాట్లు గౌరవించేలా అందరి వ్యాఖ్యలు ఉండాలన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా స్మితా సబర్వాల్ ఒక పోస్ట్ చేశారు.
సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుండటంతో మంత్రి కొండా సురేఖ వెనక్కి తగ్గారు. ఆ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. తన వ్యాఖ్యలు సమంత మనోభావాలను దెబ్బతీసేలా లేవని ఆమె స్పష్టం చేశారు. సమంత స్వశక్తితో జీవితంలో ఎదిగారని, తాను కేవలం ఆమెను మెచ్చుకున్నానని సురేఖ చెప్పుకొచ్చారు. తాను కూడా సమంతను స్ఫూర్తిగా భావిస్తున్నానని మంత్రి చెప్పారు. తన వ్యాఖ్యల వల్ల సమంత కానీ, ఆమె అభిమానులు కానీ బాధపడి ఉంటే.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేందుకు తాను రెడీ అని కొండా సురేఖ చెప్పారు.