Azharuddin : అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు.. హెచ్‌సీఏ నిధుల మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం
ఈ ఆర్థిక లావాదేవీలలో తన పాత్రపై స్పష్టత ఇవ్వడానికి తమ ఎదుట హాజరుకావాలని అజారుద్దీన్‌ను(Azharuddin) ఈడీ కోరింది.
- By Pasha Published Date - 12:09 PM, Thu - 3 October 24

Azharuddin : కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)తో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఈ సమన్లను జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక వ్యవస్థలు, క్యానోపీల సేకరణ కోసం కేటాయించిన రూ. 20 కోట్ల దుర్వినియోగానికి సంబంధించి ఈడీ కేసు నమోదు చేసింది. ఈ ఆర్థిక లావాదేవీలలో తన పాత్రపై స్పష్టత ఇవ్వడానికి తమ ఎదుట హాజరుకావాలని అజారుద్దీన్‌ను(Azharuddin) ఈడీ కోరింది. ఈ కేసులో ఆయనకు ఈడీ నుంచి సమన్లు జారీ కావడం ఇదే తొలిసారి. ఇవాళే అజారుద్దీన్ ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉందని సమాచారం.
Also Read :Hassan Nasrallah : రేపు హిజ్బుల్లా చీఫ్ అంతిమయాత్ర.. ఇజ్రాయెల్ దాడిలో నస్రల్లా అల్లుడి మృతి
వాస్తవానికి హెచ్‌సీఏతో ముడిపడిన మనీలాండరింగ్ కేసును 2023 నవంబరులో ఈడీ నమోదు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)- 2002 నిబంధనల ప్రకారం.. అప్పట్లో తెలంగాణలోని తొమ్మిది ప్రదేశాలలో ఈడీ సోదాలు చేసింది. హెచ్‌సీఏ నిధుల దుర్వినియోగం జరిగిన సమయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసిన గడ్డం వినోద్, శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ ఇళ్లలో ఈడీ సోదాలు చేసింది. ఎస్ఎస్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆఫీసులో, ఆ సంస్థ ఎండీ సత్యనారాయణ నివాసంలో కూడా తనిఖీలు జరిపింది. అప్పట్లో కొన్ని డిజిటల్ పరికరాలు, కీలకమైన డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. లెక్కలు చూపలేని విధంగా బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 10.39 లక్షల డబ్బును కూడా సీజ్ చేశారు. గడ్డం వినోద్‌కు చెందిన ఒక నివాసంలో తనిఖీలు చేయగా.. దాన్ని ఆయన సోదరుడు గడ్డం వివేకానంద్ నడుపుతున్న పలు కంపెనీల కోసం వాడుతున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏసీబీ నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లింది.