Phone Tapping Case : వ్యక్తిగత జీవితాలపై రాద్ధాంతం చేయొద్దు.. మీడియాకు హైకోర్టు ఆదేశాలు
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
- By Pasha Published Date - 03:40 PM, Wed - 10 July 24

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విషయంలో సంయమనం పాటించాలని మీడియాను ఆదేశించింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని సూచించింది. ప్రత్యేకించి జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల పేర్లను బహిర్గతం చేయొద్దని న్యాయస్థానం నిర్దేశించింది. ఫోన్ నంబర్లు, ఫొటోలను బహిర్గతం చేయొద్దని సూచించింది. రాజకీయ నేతలతో పాటు జడ్జిల ఫోన్లను ట్యాప్ చేశారని మీడియాలో కథనాలు రావడంతో ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు సుమోటోగా(Phone Tapping Case) స్వీకరించింది.
We’re now on WhatsApp. Click to Join
దీనిపై ఇప్పటికే తెలంగాణ(Telangana) ప్రభుత్వం కోర్టు ఎదుట కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు పై ఆదేశాలను జారీ చేసింది. పోలీసు శాఖకు, మీడియాకు కీలక ఆర్డర్స్ ఇచ్చింది. పేర్లను వెల్లడించే విషయంలో సంయమనంతో వ్యవహరించాలని కోరింది. తదుపరి విచారణను ఈనెల 23వ తేదీకి వాయిదా వేసింది.
Also Read :Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు రూ. 50 లక్షల జరిమానా విధించిన హైకోర్టు
అంతకుముందు హైకోర్టులో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో కీలక అంశాలను ప్రస్తావించారు. ఆ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు కీలకమని అందులో ప్రస్తావించారు. రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్ లు, న్యాయమూర్తులు, పాత్రికేయులు ఇలా ఏ ఒక్కరినీ వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేశారని తెలిపారు. విదేశాలకు పరారైన ప్రభాకర్‌రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావును విచారించడం కీలకమని హైకోర్టుకు పోలీసులు తెలిపారు. ఇంటర్‌పోల్ బ్లూ నోటీస్ ద్వారా వారిద్దరిని దేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్ రావుల ఆదేశాల మేరకు ప్రతిపక్ష నేతలు, పలువురు వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసినట్లు దర్యాప్తు తేలిందని హైకోర్టుకు పోలీసులు తెలియజేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వ నిఘా సంస్థలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.