Employee Issues : జీవో 317పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు.
- By Latha Suma Published Date - 08:49 PM, Sat - 30 November 24

Employee Issues : తెలంగాణ ప్రభుత్వం జీవో 317కు సంబంధించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మార్గదర్శకాలతో కూడిన 243, 244, 245 ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉత్తర్వుల్లో తెలిపారు. మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక, ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది.
కాగా, రేవంత్ సర్కారు త్వరలోనే తెలంగాణలో జీవో 317 కారణంగా నష్టపోయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ జీవో అమలుతో ఇబ్బందులకు గురైన భార్యాభర్తలు, మ్యూచువల్, అనారోగ్య కారణాలున్న ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైలుపై సీఎం రేవంత్ సంతకం చేసినట్టు సమాచారం. 317 జీవోపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఆ సబ్ కమిటీ మ్యూచువల్, హెల్త్ గ్రొండ్, స్పౌజ్ ట్రాన్స్‌ఫర్లు జరపాలని కొన్ని రోజుల కిందట ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలును సీఎం రేవంత్ రెడ్డికి పంపగా.. శుక్రవారమే దాన్ని ఆమోదించినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఇటీవల సచివాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధ్యక్షతన ఉపసంఘం సమావేశమైంది. స్థానికత ప్రకారం ఉద్యోగుల కేటాయింపుపై సుదీర్ఘంగా చర్చించింది. న్యాయ వివాదాలకు తావు లేకుండా కేటాయింపు జరగాలని అభిప్రాయపడింది. స్థానికతకు అవరోధంగా ఉన్న క్లాజ్‌లపై మంత్రులు రాజనర్సింహ, శ్రీధర్‌బాబు 3 గంటలకుపైగా న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ వివిధ శాఖల ఉన్నతాధికారులతో పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించింది. తుది నివేదిక పత్రాలను రూపొందించింది. ఇటీవల ఈ నివేదిక పత్రాలను సీల్డ్ కవర్‌లో మంత్రి దామోదర రాజనర్సింహా సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
Read Also: Traffic Challan : డ్రైవింగ్ చేస్తూ సిగరెట్ తాగితే చలాన్ వేస్తారా..? సమాధానం మీకు తెలుసా?