TCongress: నిత్యావసర ధరలపై ధర్నాకు ‘టీకాంగ్రెస్’ రెడీ
పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం,
- By Balu J Published Date - 06:45 PM, Mon - 1 August 22

పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, అగ్నిపథ్ తదితర సమస్యలపై కాంగ్రెస్ ఆగస్టు 5న రాష్ట్రంలో ధర్నాలు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్‌రెడ్డి కోరారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపునకు వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. భారీ వరదలు, భారీ వర్షాల కారణంగా రాష్ట్రానికి 2 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రేవంత్ అన్నారు.
‘సుమారు 20 లక్షల ఎకరాల్లో పలు పంటలు దెబ్బతిన్నాయి. అయినా కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. బాధితులను ఆదుకోవడంలో రెండు ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి’ అని విమర్శించారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ధర్నాలో పెద్దఎత్తున పాల్గొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.