T Congress: జూన్ నెలాఖరుకు టీకాంగ్రెస్ ఎన్నికల టీమ్.. రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తుందా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గేర్ మారుస్తోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలన్నా దానికి ఇంకో ఏడాదికి పైగానే సమయముంది.
- By Hashtag U Published Date - 12:00 PM, Sun - 29 May 22

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గేర్ మారుస్తోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాలన్నా దానికి ఇంకో ఏడాదికి పైగానే సమయముంది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే.. ముందే ఎన్నికలు వస్తాయా అన్నట్టుగా పార్టీలన్నీ అడుగులు వేస్తున్నాయి. అందుకే వచ్చే నెల చివరిలో టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించడానికి కసరత్తు మొదలైంది.
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపు ఏడాదవుతోంది. పైగా ఎన్నికలకు కూడా దాదాపు ఏడాది సమయముంది. అందుకే ఈలోపే కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటే.. ఎన్నికల టీమ్ గా అది రంగంలోకి దిగడానికి అవకాశం ఉంటుంది. వరంగల్ డిక్లరేషన్ ను ఊరూవాడకు తీసుకెళ్లేందుకు వీలుగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
రైతు రచ్చబండ కార్యక్రమం పూర్తయ్యాక.. పదవుల పందేరంపై రేవంత్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. టీపీసీసీకి నూతన ప్రధాన కార్యదర్శులతోపాటు కార్యదర్శులు వస్తారు. వీరితోపాటు కార్యవర్గ సభ్యులను కూడా నియమిస్తారు. అనుబంధ సంఘాలకు కూడా పూర్తిస్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేసే దిశగా ప్లాన్ చేస్తున్నారు. ఇక జిల్లా అధ్యక్షుల పనితీరు సరిగా లేకుంటే వారిని మార్చడానికి కూడా అధిష్టానం యోచిస్తోంది. తన ఎన్నికల టీమ్ ను రెడీ చేసిన వెంటనే.. బస్సు యాత్ర, పాదయాత్రలపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చేలా.. తన ఎన్నికల టీమ్ కు రేవంత్ రెడ్డి రూపకల్పన చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలపై ప్రభావం చూపించగలిగే నాయకులకే ఈసారి పదవులు దక్కబోతున్నట్టు సమాచారం.