Telangana Cabinet: ఈ నెల 5న కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ?!
ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.
- By Gopichand Published Date - 10:30 AM, Mon - 2 June 25

Telangana Cabinet: ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సమావేశం నిర్వహించి కీలక అంశాలను చర్చించాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించారు. ఆదివారం ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర అవతరణ వేడుకలు, ఇందిరమ్మ ఇండ్లు, రెవెన్యూ సదస్సులు, వాన కాలం పంటల సాగు సన్నద్ధత, రాజీవ్ యువ వికాసం అంశాలపై మంత్రులు అందించిన నివేదికపై సమావేశంలో చర్చించారు.
మే 29, 30 తేదీలలో జిల్లాల్లో పర్యటించిన మంత్రులు ఈ నాలుగు అంశాలపై అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లతో పాటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తుది జాబితాలు, రెవెన్యూ సదస్సుల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లాల వారీగా తయారు చేసిన నివేదికలపై సమావేశంలో వివరించారు. రాజీవ్ యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పరిశీలన తరువాతే అర్హుల జాబితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మరింత లోతుగా విశ్లేషించి లబ్ది దారులను గుర్తించాలని నిర్ణయించాలన్నారు. ఒక్క అనర్హుడికి కూడా రాజీవ్ యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దన్నారు. ఈ అంశంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్యోగుల సమస్యలపై నియమించిన కమిటీకి సంబంధించి అధికారులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఇప్పటికే నివేదిక అందించారు.
Also Read: Suryakumar Yadav: సచిన్, రోహిత్‌లకు కూడా సాధ్యం కాలేదు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్!
ఆ నివేదికపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు వివరించారు. దీనిపై కేబినెట్‌లో చర్చించి సమస్యల పరిష్కారంపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోనున్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మంత్రులు అభినందించారు.