Telangana Budget 2024 : రేవంత్ సీఎంగా తెలంగాణ తొలి బడ్జెట్.. ఎప్పుడంటే ?
Telangana Budget 2024 : బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ రెడీ అవుతోంది.
- By Pasha Published Date - 09:06 AM, Mon - 29 January 24

Telangana Budget 2024 : బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ రెడీ అవుతోంది. కేంద్ర సర్కారు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నందున తెలంగాణలోనూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని రేవంత్ సర్కారు యోచిస్తోందట. ఒకవేళ రాష్ట్ర సర్కారు పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడితే పద్దులు, డిమాండ్లపై సవివరమైన చర్చ చేయాలి. ఇందుకోసం శాసనసభ సమావేశాలను కనీసం రెండు వారాల పాటు నిర్వహించాలి. అదే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడితే సమావేశాలు కేవలం 4 రోజులు నిర్వహిస్తే సరిపోతుంది.
Also Read : World War III : అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం : జెలెన్స్కీ
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారం తర్వాత ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆలోపే తెలంగాణ బడ్జెట్ సమావేశాలను ముగించాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపు మొగ్గుచూపుతోందని తెలుస్తోంది. వాస్తవ రాబడుల ఆధారంగానే వార్షికపద్దు రూపొందించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్ని శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో పొందుపర్చే అంశాల ప్రాతిపదికన తెలంగాణ బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. అయితే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలా? ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టాలా? అనే దానిపై కొన్నిరోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
కులగణనపై బిల్లు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు అనుగుణంగా.. తెలంగాణలోనూ కుల గణన చేయాలని రేవంత్ సర్కారు డిసైడైంది. దీనికి సంబంధించిన బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఆ బిల్లు ముసాయిదా తయారీ బాధ్యతలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అప్పగించారు. గతేడాది బీహార్ సర్కార్ రెండు దఫాలుగా కులగణన సర్వేచేసింది. కర్ణాటకలో సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే పేరిట గతంలో కులగణన చేపట్టారు. అవసరమైతే ఇప్పటికే కులగణన చేపట్టిన బిహార్, ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మరింత మెరుగైన విధానాలను రాష్ట్రంలో అమలు చేసేలా బిల్లు రూపొందించాలని సూచించారు.