Telangana BRS MLA Defection Case : తెలంగాణ లో మరోసారి ఎన్నికలు..? నిజమేనా..?
Telangana BRS MLA Defection Case : సుప్రీంకోర్టు నేరుగా అనర్హతా వేటు వేయడానికి నిరాకరించినప్పటికీ, స్పీకర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
- By Sudheer Published Date - 10:16 PM, Thu - 31 July 25

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత(Telangana BRS MLA Defection)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు నేరుగా అనర్హతా వేటు వేయడానికి నిరాకరించినప్పటికీ, స్పీకర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. అయితే ఇది కేవలం ఆదేశమా లేక సూచనా అన్నదానిపై స్పష్టత కొరవడింది. అదే సమయంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతా వేటు వేసే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది. కోర్టులు ఆయన నిర్ణయాలను ప్రశ్నించలేవు లేదా ఫలానా నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించలేవు. ఈ చట్టంలో స్పీకర్‌కు కాలపరిమితి లేదు కాబట్టి, చట్ట సవరణ చేసి టైమ్ ఫ్రేమ్ పెడితేనే ఆ చట్టానికి విలువ ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు, సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది.
Jagan Arrest : జగన్ అరెస్ట్‌పై లోకేష్ ఆసక్తికర కామెంట్
ఈ నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోయినా అది సుప్రీంకోర్టు ధిక్కారం కిందకు రాదు అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ తీర్పును పాటిస్తే భవిష్యత్తులో వివిధ రాష్ట్రాల్లోనూ ఇదే వర్తించే అవకాశం ఉందని, ఇది శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యాన్ని అంగీకరించడమే అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తుంది. అందుకే తెలంగాణ స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాలను ఎలా పాటిస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇక్కడ ఉప ఎన్నికలు రావాలంటే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేయాలి. కానీ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుంటే రాజీనామాలు చేయిస్తుంది తప్ప అనర్హతా వేటు వేయదు. అలా రాజీనామాలు చేసి ఆమోదింప చేసుకుంటేనే ఉప ఎన్నికలు వస్తాయి.
Minister Lokesh: సింగపూర్ పర్యటన ఫలితం.. రూ.45వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి నారా లోకేశ్
ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఉప ఎన్నికలు రావని స్వయంగా ప్రకటించారు. ఒకవేళ రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలు తీసుకురావాలని అనుకుంటే తప్ప నిర్ణయంలో మార్పు రాదు. స్పీకర్ ముందు మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది. బీఆర్‌ఎస్ పెట్టుకున్న అనర్హత పిటిషన్లను తిరస్కరించడం. స్పీకర్ ఇప్పటికే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. వారు తాము పార్టీ మారలేదని వివరణ ఇస్తే, దానినే పరిగణనలోకి తీసుకుని బీఆర్‌ఎస్ పిటిషన్లను తిరస్కరించవచ్చు. అలాంటి సమయంలో వారి పదవులు పోవు, అసెంబ్లీ అధికారిక జాబితాలో వారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉంటారు. అయితే అలా చేయడం నైతికత కాదన్న విమర్శలు వస్తాయి. ఎలా చూసినా, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు తక్కువని, ఎమ్మెల్యేల విషయంలో ప్రజాతీర్పు కోరాలని అనుకుంటే కాంగ్రెస్ రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళ్తుందని, కానీ అనర్హతా వేటు పడే అవకాశాలు ఉండవని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.