Bathukamma: గిన్నిస్ రికార్డు సాధించిన తెలంగాణ బతుకమ్మ!
ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి, అధికారులందరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- By Gopichand Published Date - 06:56 PM, Mon - 29 September 25

Bathukamma: తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ (Bathukamma) పండుగ అరుదైన గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించింది. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేసారి బతుకమ్మ ఆడి ఈ అద్భుత ఘనతను సాధించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, మహిళా శక్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఈ మహా పండుగ, తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచింది. ఈ రికార్డు నమోదు కావడంతో బతుకమ్మ పండుగ ప్రాముఖ్యత మరింత పెరిగింది. హైదరాబాద్‌లోని సరూర్ స్టేడియంలో సోమవారం సాయంత్రం గ్రాండ్‌గా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైదానంలో 63 అడుగుల భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు.
తెలంగాణ బతుకమ్మ పండుగ గిన్నిస్ రికార్డును (నివేదికలో లిమ్కా రికార్డు అని ఉంది) సృష్టించిన సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క మహిళా లోకాన్ని, ఈ కార్యక్రమ నిర్వాహకులను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. “ఈరోజు మన బతుకమ్మ గ్లోబల్ స్థాయికి వెళ్లింది” అని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఎంతో శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో, పవిత్రతతో బతుకమ్మ ఆడి రికార్డు సృష్టించిన అక్కాచెల్లెమ్మలందరికీ ఆమె వందనాలు తెలియజేశారు.
Also Read: India To Bhutan: భారతదేశం- భూటాన్ మధ్య రైలు మార్గం.. వ్యయం ఎంతంటే?
మహిళా శక్తికి నిదర్శనం
“పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించగలం” అని తెలంగాణ మహిళలు నిరూపించారని మంత్రి అన్నారు. నేడు తెలంగాణ బతుకమ్మ కీర్తిని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కించి, మహిళామణులు తెలంగాణ సత్తా చాటారని కొనియాడారు. తెలంగాణ ఆడబిడ్డలు దేన్నైనా సాధిస్తారని ఈరోజు నిరూపించారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం స్ఫూర్తితో మహిళలు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.
నిర్వాహకులకు ధన్యవాదాలు
ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి, అధికారులందరికీ ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ బతుకమ్మకు ఈ ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె “జై బతుకమ్మ.. జై తెలంగాణ” అని ముగించారు.