India To Bhutan: భారతదేశం- భూటాన్ మధ్య రైలు మార్గం.. వ్యయం ఎంతంటే?
రెండు దేశాల మధ్య కొత్త రైలు మార్గం ప్రాజెక్టుపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం (MoU)లో ఏ మూడవ దేశం జోక్యం లేదని స్పష్టం చేశారు.
- By Gopichand Published Date - 06:44 PM, Mon - 29 September 25

India To Bhutan: భారతదేశం- భూటాన్ (India To Bhutan) మధ్య వాణిజ్యం, పర్యాటకం, ప్రజల రాకపోకలను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రెండు అంతర్జాతీయ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి. కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా మొదటిసారిగా భారతదేశం, భూటాన్ నేరుగా రైలు మార్గం ద్వారా అనుసంధానం కానున్నాయి. రూ. 4,033 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ రైల్వే ప్రాజెక్టుల వల్ల ఇరు దేశాల మధ్య స్నేహబంధం పెరగడమే కాకుండా వాణిజ్య, పర్యాటక రంగాలకు కొత్త ఊపందుకోనుంది.
రూ. 4,033 కోట్ల వ్యయం
కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ కొత్త ప్రాజెక్టుల వల్ల సరిహద్దు ప్రాంతాలలో ఉపాధి, ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. భూటాన్‌లోని సమత్సే, గాలెఫు జిల్లాలు పెద్ద ఎగుమతి-దిగుమతి (ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్) కేంద్రాలుగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాలు భారత్-భూటాన్ మధ్య ఉన్న సుమారు 700 కిలోమీటర్ల సరిహద్దును కలుపుతాయి.
Also Read: Raja Saab Trailer: రాజాసాబ్ ట్రైలర్, రిలీజ్ డేట్ వచ్చేసింది!
ప్రాజెక్టు వ్యయం, ప్రయోజనాలు
కేంద్ర ప్రభుత్వం సోమవారం రూ. 4,033 కోట్ల అంచనా వ్యయంతో భారత్- భూటాన్ మధ్య రెండు పెద్ద రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పర్యాటకం, ప్రజల రాకపోకలు సులభమవుతాయి. దీనికి ముందు, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని హాసీమారా వరకు మాత్రమే రైలు కనెక్టివిటీ ఉండేది. ఇప్పుడు మొదటిసారిగా ఇరు దేశాల మధ్య నేరుగా రైలు మార్గం ఏర్పడనుంది భూటాన్ ప్రభుత్వం తన నగరాలైన సమత్సే, గాలెఫును ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఇరు దేశాల యువతకు రవాణా, లాజిస్టిక్స్, పర్యాటక రంగాలలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే సరిహద్దు భద్రత, విపత్తు నిర్వహణ కోసం సౌకర్యాలు మెరుగుపడతాయి.
విదేశాంగ కార్యదర్శి ప్రకటన
రెండు దేశాల మధ్య కొత్త రైలు మార్గం ప్రాజెక్టుపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం (MoU)లో ఏ మూడవ దేశం జోక్యం లేదని స్పష్టం చేశారు. ఈ రైలు మార్గం ఇరు దేశాల మధ్య కనెక్టివిటీ, విశ్వాసాన్ని మరింత గాఢం చేస్తుందని ఆయన అన్నారు.