Telangana Premier League : తెలంగాణ ప్రీమియర్ లీగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ సహకారం
టీపీఎల్(Telangana Premier League) టికెట్ల విక్రయం పూర్తి పారదర్శకంగా జరగాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులకు జగన్‌మోహన్ రావు సూచించారు.
- By Pasha Published Date - 09:25 PM, Wed - 19 February 25

Telangana Premier League : తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) నిర్వహణ, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వైపు నుంచి పూర్తి సహకారాన్ని అందిస్తామని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఐపీఎల్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉప్పల్‌లో మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూడా సహకారం అందిస్తామని తెలిపారు. పార్కింగ్ నిర్మాణంపై అంచనాలను రూపొందిస్తే వచ్చే ఏడాది పనులను ప్రారంభించేందుకు తమవంతు సాయాన్ని అందిస్తామన్నారు. ఈమేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రతినిధులు సీఈఓ షణ్ముగం, డైరెక్టర్ కిరణ్, జీఎం శ్రీనాథ్ ఈరోజు (బుధవారం) హామీ ఇచ్చారు.
Also Read :HCA President: ఐపీఎల్‌కు హైదరాబాద్ సిద్ధం.. పలు విషయాలు పంచుకున్న హెచ్‌సీఏ అధ్యక్షుడు!
ఉప్పల్ స్టేడియంలో..
ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యంతో జరిగిన సమన్వయ సమావేశంలో అర్శనపల్లి జగన్‌మోహన్ రావు, హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, సంయుక్త కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీపీఎల్(Telangana Premier League) టికెట్ల విక్రయం పూర్తి పారదర్శకంగా జరగాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులకు జగన్‌మోహన్ రావు సూచించారు. స్టేడియంలో తినుబండారాలను, శీతల పానీయాలను సాధారణ రేట్లకే అమ్మాలని కోరారు. వచ్చే నెల (మార్చి) 2న హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు- సన్‌రైజర్స్ హైదరాబాద్ బృందం కలిసికట్టుగా ఐపీఎల్ ఏర్పాట్లపై స్టేడియం మొత్తాన్ని పరిశీలిస్తామని జగన్‌మోహన్ రావు వెల్లడించారు.
Also Read :Delhi Chief Minister: వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా!
టీపీఎల్ నిర్వహణకు ఎస్‌ఆర్‌హెచ్ సహకారం
- రాష్ట్రంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటు
- ఉప్పల్ స్టేడియంలో మల్టీ లెవల్ పార్కింగ్‌కు కసరత్తు
- ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణపై సమన్వయ సమావేశం