Ponnam Prabhakar: SIR ప్రక్రియ నత్తనడకన.. గడువు పొడిగించాలని పొన్నం విజ్ఞప్తి
- Author : Vamsi Chowdary Korata
Date : 15-07-2026 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రస్తుతం నత్తనడకన సాగుతోంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ ముగియడానికి గడువు దగ్గర పడుతున్నప్పటికీ, ఇప్పటివరకు రాష్ట్రంలో కేవలం 49.28 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈ నెల 24వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుండగా, మిగిలిన కొద్ది రోజుల్లోనే వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. బూత్ స్థాయి అధికారులు (BLO) ఇంటింటికీ తిరిగి ఎన్యూమరెన్ ఫారాల పంపిణీ పూర్తి చేశామని ప్రకటిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. తమకు ఇంకా ఎలాంటి పత్రాలు అందలేదని, అధికారులు తమ ఇళ్లకు రాలేదని అనేక ప్రాంతాల నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తుండటం గమనార్హం.
తెలంగాణ వ్యాప్తంగా ఓటరు సవరణ ప్రక్రియ(ఎ్‌సఐఆర్) నత్తనడకన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రక్రియ గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం కోరింది. ఈ సవరణ ప్రక్రియ ఇంతలా మందగించడానికి ప్రధానంగా రెండు రకాల కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అధికారులు ఎన్యూమరేషన్ పత్రాలను అందించినప్పటికీ, ఓటర్లు వాటిని పూర్తి చేసి, అవసరమైన గుర్తింపు పత్రాలను జతపరిచి తిరిగి సబ్మిట్ చేయడంలో తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోంది. రెండవది, సేకరించిన పత్రాలను నియోజకవర్గాల వారీగా ఎన్నికల సర్వర్‌లో ఆన్‌లైన్ (Digitization) చేయడంలో సాంకేతిక ఇబ్బందులు, సిబ్బంది కొరత కారణంగా తీవ్ర ఆలస్యం జరుగుతోంది. ఒకవైపు ఫారాల సబ్మిషన్ ఆలస్యం కావడం, మరోవైపు డిజిటలైజేషన్ నెమ్మదించడంతో ఓటర్ల జాబితా సవరణ తుది గడువును మరికొంత కాలం పొడిగించాలనే డిమాండ్ రాజకీయ పార్టీల నుంచి కూడా వ్యక్తమవుతోంది