Seethakka plays drums: డప్పు కొట్టిన ఎమ్మెల్యే సీతక్క.. ఎవరి కోసమో తెలుసా..?
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు ఉత్సాహంగా సాగుతున్నారు.
- By Gopichand Published Date - 08:14 PM, Sun - 16 October 22

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల నేతలు ఉత్సాహంగా సాగుతున్నారు. తమ తమ పార్టీలకే ఓటేయాలంటూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తమదైన శైలి వినూత్న చర్యలతో ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తరఫున ఎన్నికల ప్రచారంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. సీతక్క తనదైన స్టైల్ లో ప్రచారం చేశారు. డప్పు కళాకారులతో కలిసి డప్పు కొట్టి మరీ దరువేసి సందడి చేశారు.
మునుగోడులోని నాంపల్లి మండలంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల కోరిక మేరకు డప్పు తన భుజానికి వేసుకొని డప్పు కళాకారులతో డప్పు వాయిస్తూ.. డప్పు చప్పుళ్లకు దరువు వేశారు. అనంతరం మండల పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి స్రవంతిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే ప్రస్తతం సీతక్క డప్పు కొట్టిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అంతకుముందు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారంలో ఓటర్లనుద్దేశించి ప్రసంగిస్తూ తన తండ్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని గుర్తుచేసుకుని తనకు ఓట్లు వేయాలని కోరారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని ప్రజలు ఆదరిస్తే మునుగోడును దత్తత తీసుకుంటామని ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.