Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, కొత్త పథకాల ప్రారంభాలు, లేదా ప్రచార కార్యక్రమాలు ఏవీ చేపట్టడానికి వీలు లేదు.
- By Gopichand Published Date - 06:43 PM, Tue - 25 November 25
Sarpanch Election Schedule: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను (Sarpanch Election Schedule) విడుదల చేశారు. ఈ ప్రకటనతో నేటి (మంగళవారం) నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణమే అమలులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలోని గ్రామస్థాయి పాలనలో కీలకంగా వ్యవహరించే వేలాది సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు భర్తీ కానున్నాయి.
మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ప్రకటించిన వివరాల ప్రకారం.. పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నారు.
- మొదటి దశ ఎన్నికలు: డిసెంబర్ 11న పోలింగ్
- రెండవ దశ ఎన్నికలు: డిసెంబర్ 14న పోలింగ్
- మూడవ దశ ఎన్నికలు: డిసెంబర్ 17న పోలింగ్
మొదటి దశలో మొత్తం 4,200 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని కమిషనర్ తెలిపారు. మిగిలిన స్థానాలకు రెండు, మూడు దశల్లో పోలింగ్ నిర్వహించబడుతుంది.
Also Read: Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?
నామినేషన్ల స్వీకరణ
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రేపటి (బుధవారం) నుంచే ప్రారంభమవుతుందని కమిషనర్ వెల్లడించారు. ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి తారాస్థాయికి చేరింది. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
ఎన్నికల కోడ్ అమలు
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, కొత్త పథకాల ప్రారంభాలు, లేదా ప్రచార కార్యక్రమాలు ఏవీ చేపట్టడానికి వీలు లేదు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చూడటం తమ లక్ష్యమని రాణి కుముదిని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను కచ్చితంగా పాటించాలని ఆమె సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల ఫలితాలు, గ్రామీణ రాజకీయాల్లో కొత్త మార్పులకు నాంది పలకనున్నాయి. ఈ ప్రకటనతో గ్రామీణ ఓటర్లలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.