Saraswathi Pushkaralu 2026: కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలు ప్రారంభం
- Author : Vamsi Chowdary Korata
Date : 19-05-2026 - 11:46 IST
Published By : Hashtagu Telugu Desk
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాల కోసం ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేసింది. భక్తుల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 3,360 బస్సులతో మొత్తం 5,772 ప్రత్యేక ట్రిప్పులను నడపనున్నారు. పుష్కరాల ప్రత్యేక బస్సులలో సాధారణ ఛార్జీల కంటే 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా వర్తిస్తుందని స్పష్టం చేశారు.
త్రివేణి సంగమ క్షేత్రమైన కాళేశ్వరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ రవాణా ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల పవిత్ర సంగమ తీరంలో ఈ పుష్కర వేడుకలు జరగనున్నాయి. ఈ పవిత్ర స్నానాల కోసం తరలివచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తెలంగాణ ఆర్టీసీ దాదాపు 3360 ప్రత్యేక బస్సులను రంగంలోకి దించుతోంది. ఈ బస్సుల ద్వారా రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాలు, జిల్లాల నుండి కాళేశ్వరానికి మొత్తం 5,772 ప్రత్యేక ట్రిప్పులను నడపాలని రవాణా శాఖ భారీ ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు వరంగల్ రీజినల్ మేనేజర్ ఎస్.భవానీప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో అధికారిక వివరాలను వెల్లడించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని కీలక డిపోలైన హనుమకొండ, వరంగల్-1, వరంగల్-2, పరకాల, నర్సంపేట, జనగామ, భూపాలపల్లి, తొర్రూరు, మహబూబాబాద్ల నుంచి కాళేశ్వర క్షేత్రానికి నేరుగా 59 ప్రత్యేక బస్సులు నిరంతరాయంగా సేవలు అందించనున్నాయి. వీటితో పాటు రీజియన్లోనే అత్యంత ప్రధానమైన హనుమకొండ బస్టాండ్ నుంచి భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను నడపనున్నారు. పుష్కరాల వేళ కాళేశ్వరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేందుకు జిల్లా యంత్రాంగం ఆర్టీసీకి 4.36 ఎకరాల విస్తీర్ణమున్న స్థలాన్ని కేటాయించింది. ఈ భారీ స్థలంలో అన్ని హంగులతో కూడిన తాత్కాలిక బస్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, నిరంతర విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.
పుష్కరాల నిర్వహణలో భద్రతకు, నిరంతర పర్యవేక్షణకు ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు. అత్యవసర సేవల కోసం, క్షేత్రస్థాయిలో రవాణా ఇబ్బందులను పర్యవేక్షించేందుకు రెండు మొబైల్ ద్విచక్రవాహనాలను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులకు బస్టాండ్ పరిసరాల్లో దిశానిర్దేశం చేయడానికి, బస్సుల వేళల గురించిన సమాచారం అందించడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ వాలంటీర్లను నియమిస్తున్నారు. అయితే పుష్కరాల కోసం నడిపే ఈ ప్రత్యేక బస్సులలో ఆపరేషనల్ ఖర్చుల దృష్ట్యా సాధారణ రోజుల్లో ఉండే ఛార్జీల కంటే 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నట్లు రీజినల్ మేనేజర్ స్పష్టం చేశారు. ఈ అదనపు వడ్డన ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయం ఈ ప్రత్యేక పుష్కర బస్సుల్లోనూ యథావిధిగా వర్తిస్తుందని చెప్పారు. మహిళా భక్తులు ఈ అవకాశాన్ని ఉచితంగా వినియోగించుకోవచ్చునని ఆర్ఎం భవానీప్రసాద్ స్పష్టం చేశారు.