Revanth Reddy: జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: రేవంత్ వార్నింగ్
ప్రజలను ఆదుకునేందుకు సీఎం కానీ, మున్సిపల్ శాఖా మంత్రి (KTR) కానీ తగిన చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ అన్నారు.
- By Balu J Published Date - 01:07 PM, Thu - 27 July 23

Revanth Reddy: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల సమస్యలన పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే శుక్రవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ప్రజలను ఆదుకునేందుకు సీఎం కానీ, మున్సిపల్ శాఖా మంత్రి (KTR) కానీ తగిన చర్యలు తీసుకోవడం లేదని, జన్మదిన వేడుకల్లో బిజీగా ఉన్న కేటీఆర్ ప్రజల పట్ల తన కర్తవ్యాన్ని మరచిపోయినట్లు కనిపిస్తోందని, ప్రభుత్వం సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు గంటల తరబడి రోడ్లపైనే కూరుకుపోతున్నారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా, ఇస్తాంబుల్‌గా మారుస్తామన్న మాటలు నీటి మూటలుగా మిగిలిపోయాయని రేవంత్ అన్నారు. నాలాల చుట్టూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాలు, గోడల చుట్టూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన రేవంత్, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చిన్నచూపు చూసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: GHMC High Alert: ఇండ్లలోనే ఉండండి, బయటకు రాకండి.. సిటీ జనాలకు GHMC అలర్ట్