HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Reasons Behind Defeat Of Kcr

Reasons Behind Defeat of KCR : కేసిఆర్ పతనానికి కారణాలేంటి..?

ఈ పరాజయం బీఆర్ఎస్ (BRS) ది కాదు, కేసీఆర్ ది అని మాత్రమే చెప్పాలి ఎందుకు ఇలా జరిగింది

  • By Sudheer Published Date - 08:28 PM, Sun - 3 December 23
  • daily-hunt
Reasons Behind Defeat of KCR
Reasons Behind Defeat of KCR

డా. ప్రసాదమూర్తి

కర్ణుడి చావుకి లక్ష కారణాలంటారు. కేసిఆర్ పరాజయానికి కారణం ఒకటే. అది కేసీఆరే (KCR). ఎన్నికల్లో కేసీఆర్ ను చూసి మాత్రమే ఓటు వేయమని కేటీఆర్ (KTR) తో సహా బీఆర్ఎస్ నాయకులంతా ముక్త కంఠంతో ఘోషించారు. కాబట్టి ఈ పరాజయం బీఆర్ఎస్ (BRS) ది కాదు, కేసీఆర్ ది అని మాత్రమే చెప్పాలి ఎందుకు ఇలా జరిగింది, ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు మీడియాలో, మేధావి వర్గాల్లో, రాజకీయ పరిశీలకుల చర్చల్లో, విశ్లేషణలు సాగుతాయి. ఇక్కడ మనం అసలు విషయం మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ అంటే బీఆర్ఎస్. కాబట్టి కేసీఆర్ చేసిన తప్పులే ఆయన పార్టీ పరాజయానికి కారణం అవుతాయి. తన్లాడి కొట్లాడి తానే రాష్ట్రాన్ని తెచ్చానని గర్వంగా చెప్పుకునే కేసీఆర్, రాష్ట్రానికి చేసిన దానికంటే తన కుటుంబానికి చేసుకున్నదే ఎక్కువ అనేది ప్రజలలోకి బలంగా వెళ్ళిపోయింది. అందుకే నేను ఐదారు రోజుల ముందు ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాను. ఈ ఎన్నిక కేసీఆర్ ఫ్యామిలీ వర్సెస్ తెలంగాణ అని. దీన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఇంతకాలం నా జర్నలిస్టు జీవనానుభావంతో చెప్పిన మాట ఇది. వేలాది యువకుల ప్రాణాల బలిదానం పునాదుల మీద లేచిన స్వతంత్ర తెలంగాణ భౌగోళిక చిత్రపటం ఒక్క కుటుంబంగా మారిపోయింది. ఉద్యోగాలు లేవని యువకులు ఆక్రోశంతో ఆగ్రహంతో ఉన్నారు. రుణమాఫీ చేయకుండా వడ్డీ మాఫీ చేయడం వల్ల మాకేం ఒరిగిందని రైతులు ఆక్రోశంతో ఉన్నారు. దళితులకు మూడెకరాలు ఎక్కడ ఇచ్చారు, దళిత ముఖ్యమంత్రి అన్నారు ఆ మాట ఏమైంది, దళిత బంధు పథకం మీ పార్టీ కార్యకర్తలకే అందింది అని దళితులు ఆక్రోశంతో ఉన్నారు. స్త్రీలు కళ్యాణ లక్ష్మి అందుకోవాలంటే కొద్దో గొప్పో లక్ష్మిని అధికారుల చేతుల్లో పెట్టాల్సి వస్తుందని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చెప్పుకుంటూ పోతే ఇలా కేసీఆర్ చేసిన తప్పుల చిట్టా అంతం లేకుండా సాగుతూ ఉంటుంది. అంతా మీరే చేశారని అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు, తన పార్టీ పతనానికి అంతా కేసీఆరే చేసుకున్నారు.

కేసిఆర్ తప్పుల చిట్టా చెప్పుకోవడానికి ముందు ముందుగా ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. తన కూతురు కవితను లిక్కర్ స్కాం నుంచి కాపాడుకోవడానికి రాజకీయాల్లో మదపుటేనుగు లాంటి కేసీఆర్ బిజెపి ముందు తలదించుకోవాల్సి వచ్చింది. ఇక్కడే బీఆర్ఎస్ పతనానికి పునాదులు పడ్డాయి. తాను మునగడమే కాదు, తనతో పాటు పడవ మొత్తాన్ని ముంచాడు అన్నట్టు కేసీఆర్ బిజెపితో ఏమి లాలూచీపడ్డారో గాని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కవితను కాపాడే ప్రక్రియలో భాగంగా తనను తాను నిండా ముంచేసుకుంది. కేసీఆర్ తన బిడ్డను కాపాడడానికి, బిజెపి కేసీఆర్ ను కాపాడడానికి.. ఇలా పరస్పరం సహకారం కోసం ఒకరికొకరు పోటీపడి రెండు పడవల్నీ నిలువునా ముంచేసుకున్నారు. కేసిఆర్ కోసం బండి సంజయ్ లాంటి ఉద్దండ నాయకుణ్ణి బరిలోంచి పక్కకు తప్పించాల్సి వచ్చింది. అప్పటినుంచి బిజెపి గ్రాఫ్ పడిపోయింది. అక్కడి నుంచే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఇదే కీలకం. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన ప్రభుత్వం పట్ల వ్యతిరేకత బాగా ఉందన్న విషయం గమనించారు. ఈ వ్యతిరేకత బిజెపి ఖాతాలోకి పోతే కాంగ్రెస్ ఏమీ చేయలేదని బలంగా నమ్మారు. అయితే ప్రజలు అమాయకులు కాదు. బీఆర్ఎస్, బిజెపి ఒకటే అని ప్రజలు కూడా బలంగా నమ్మారు. అక్కడే గిరీశం అన్నట్టు డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. సీన్ రివర్స్ అయింది. ఈ రెండు పార్టీలూ ఒకటే అని, దొర పాలన పోయి ప్రజా పాలన రావాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకున్నారు. కేసిఆర్ తనను తాను పరిపక్వమైన పరిపూర్ణమైన రాజనీతి కోవిదుడుగా, అతి గొప్ప వ్యూహకర్తగా, ఎదురులేని తనను తాను తిరుగులేని రాజకీయ విజ్ఞుడిగా భావిస్తాడు.

అందుకే ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి రెండు నెలలకు ముందే తన అభ్యర్థుల జాబితాను ఆయన రిలీజ్ చేశాడు. అందరికంటే ముందు తానున్నానని, మిగిలిన పార్టీలకంటే ముందు తాను అభ్యర్థుల్ని ప్రకటించానని, చూసుకోండి నా తడాఖా అని ఆయన జబ్బ చరిచి తొడ కొట్టి ఎన్నికల బరిలోకి దిగాడు. కానీ కాలం ఎల్లవేళలా ఒకే వ్యక్తికి కలిసి రాదు. ఇంత ముందుగా నువ్వు నీ అభ్యర్థుల్ని ప్రకటించి చాలా తప్పు చేశావు కేసీఆర్ అని కాలం హెచ్చరించింది. కానీ అప్పటికే కాలం మించి పోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద ప్రజలకు ప్రతికూలత ఉంది అని కేసిఆర్ కు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా బోగట్టా ఉంది. అయినా వాళ్లని మార్చితే ఎక్కడ తేడా జరుగుతుందో, వాళ్లు ప్రత్యర్థి వర్గాల్లోకి ఎక్కడ చేరిపోతారో, తనకు ఎక్కడ నష్టం జరుగుతుందో అని కేసిఆర్ భయపడి సిట్టింగ్ ఎమ్మెల్యేలందర్నీ(కొద్ది మినహాయింపులతో) అభ్యర్థులుగా ప్రకటించాడు. ఇక్కడే కేసీఆర్ రాజకీయ చదరంగంలో చాలా పొరపాటుగా పావు కదిపినట్టు అయింది‌. రాష్ట్రాల ఎన్నికల్లో స్థానిక సమస్యల అంశాలే ముఖ్యం. స్థానికంగా ఎమ్మెల్యేల పట్ల ప్రతికూలత ఉన్న చోట కేసిఆర్ అనుకూలత ఏమాత్రం పనిచేయదు. దాదాపు 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. ఈ విషయం కేసీఆర్ కు కూడా తెలుసు. అయినా ముందుగా బరిలోకి తాను దూకాను కాబట్టి గెలిచేది తానేనని కేసీఆర్ పొరపడ్డాడు. అక్కడే దెబ్బతిన్నాడు. స్థానిక సమస్యలకే ప్రజలు విలువనిచ్చి తమకు నచ్చని శాసనసభ్యుల్ని శాసనసభకు వెళ్లకుండా చేశారు. అంతేకాదు బిజెపిని నమ్ముకున్నట్టు ఎంఐఎంని కూడా నమ్ముకున్నాడు కేసీఆర్.

ఎంఐఎం హైదరాబాదులో తన స్థానాలను పదిలం చేసుకొని మిగిలిన తెలంగాణ మొత్తం ముస్లిం సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ కోసం అనుకూలంగా మారుస్తుందని ఆయన భ్రమపడ్డాడు. అది ఆయన భ్రమ అని ఎన్నికలకు ముందే ముస్లిం మత పెద్దలు తేల్చి చెప్పేశారు. ఈ ఎన్నికల్లో అత్యంత గుణపాఠం ఏమిటంటే, హిందుత్వ కార్డును ప్లే చేసి రాజకీయాలు నడుపుతున్న బిజెపికి వ్యతిరేకంగా పోరాడాల్సిన ఎంఐఎం బిజెపితో పరోక్ష బంధాన్ని పెట్టుకున్న బీఆర్ఎస్ తో పొత్తును కొనసాగించడం ముస్లిం సామాజిక వర్గానికి నచ్చలేదు. అందుకే దాదాపు 25 స్థానాల్లో గణనీయంగా ఉన్న ముస్లిం సామాజిక వర్గ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ కి ఓటు వేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు కుటుంబ పాలన, అవినీతి మొదలైన అంశాలతో పాటు కేసిఆర్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, దొరగారు ప్రజలకు కాదు కదా సొంత ఎమ్మెల్యేలకు, మంత్రులకే అందుబాటులో ఉండరనే విమర్శ ప్రజల వద్దకు చేరడం కూడా ఒక మైనస్ పాయింట్ గా ఆయనకు మారింది.అన్నిటికంటే ముందు చెప్పుకోవలసినటువంటి విషయాన్ని మనం ఆఖరిగా చెప్పుకుంటున్నాం.

అదేమిటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువకులంతా ఉద్యోగాలు లేక ఆక్రోశంతో ఆగ్రహంతో ఉన్నారు. వారు రాష్ట్రమంతా తిరిగి వయోవృద్ధుల్ని మీ బిడ్డలకు ఉద్యోగాలు అడగండి, పెన్షన్లు కాదు అని అర్థించారు యువత చేసిన ఈ ప్రార్థన వయోవృద్ధులలో చాలా గొప్ప ప్రభావం చూపింది. అది కూడా ఈ ఎన్నికలలో కేసీఆర్ కి వ్యతిరేకంగా పనిచేసింది. తాను ఏం చేసినా తెలంగాణను తెచ్చింది తానేనని, తనకు కలకాలం తెలంగాణ ప్రజలు బానిసలుగా ఉంటారని కేసిఆర్ అనబడే దొరగారు భావించడం వల్ల ఇంత అనర్థం జరిగింది. తెలంగాణ ప్రజలు తిరగబడే స్వభావం ఉన్నవాళ్లు. దొరా.. ఇంక నువ్వు విశ్రాంతి తీసుకో, తెలంగాణ తెచ్చిన నీకు కాదు, ఇచ్చిన పార్టీకే ఈసారి అవకాశం ఇస్తున్నాం అని తేల్చి చెప్పారు.

Read Also :  Revanth Reddy Swearing Ceremony : రేపు రాజ్ భవన్ లో తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana elections
  • brs
  • kcr
  • Reasons Behind Defeat of KCR

Related News

Schedule For Mlas Disqualif

Telangana Assembly : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ విడుదల

Telangana Assembly : సెప్టెంబర్‌ 29వ తేదీ (సోమవారం) ఉదయం 11 గంటలకు విచారణలు ప్రారంభమవనున్నాయి. ఈ విచారణల ద్వారా ప్రజాప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యేల అర్హత, అనర్హతలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • Kcr Metting

    KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

  • Jublihils Bypolls Brs Candi

    Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Ktr

    Congress Party : కాంగ్రెస్‌కు ఓటేస్తే మన ఇళ్లను కూల్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే – KTR

  • Harish Rao

    Harish Rao: సీఎం రేవంత్‌ వారికి సాయం చేయ‌లేదు.. హ‌రీష్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Latest News

  • India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య ఎన్నిసార్లు ఫైనల్ జరిగింది?

  • The Raja Saab : రేపు సాయంత్రం ‘రాజాసాబ్’ ట్రైలర్

  • Gun Firing : అమెరికాలో కాల్పుల కలకలం

  • Asia Cup Final: నేడు ఆసియా క‌ప్ ఫైన‌ల్‌.. టీమిండియా ఛాంపియ‌న్‌గా నిల‌వాలంటే!

  • Araku Coffee : అరకు కాఫీకి మరో అవార్డు – సీఎం చంద్రబాబు హర్షం

Trending News

    • Stampede : విజయ్ ని అరెస్ట్ చేస్తారా ?.. CM స్టాలిన్ రియాక్షన్ ఇదే !!

    • TVK Vijay Rally in Stampede : అరగంటలోపే పెను విషాదం

    • TVK Vijay Rally in Karur Tragedy : విజయ్ సభలో తొక్కిసలాట..33 మంది మృతి

    • Online Sales: జీఎస్టీ తగ్గింపుతో పండుగ సందడి.. కొనుగోళ్ల జోరు, ఈ-కామర్స్ రికార్డులు!

    • Dasara Offers : ఆఫర్లు అనిచెప్పి ఎగబడకండి..కాస్త ఎక్స్పైరీ డేట్ చూసుకోండి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd