Komatireddy Rajgopal Reddy : మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శల జడివాన కురిపించారు.
- By Kavya Krishna Published Date - 01:34 PM, Wed - 6 August 25

Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శల జడివాన కురిపించారు. సీఎం తన భాష మార్చుకోవాలని సూచిస్తూ, ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తూ, “ఇప్పుడీ రాష్ట్రంలో 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారు. ప్రభుత్వం దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. కానీ సీఎం కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు,” అని వ్యాఖ్యానించారు. కాలేశ్వరం అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి పదవి విషయానికొస్తే, రాజగోపాల్ రెడ్డి స్పష్టంచేశారు, “నాకు మంత్రి పదవి కావాలంటే అప్పుడే కెసిఆర్ ఇచ్చేవాడు. నేను కాంగ్రెస్‌లో చేరినప్పుడు, AICC హైకమాండ్ నాకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీ ఇప్పటికీ నిలిచే ఉందని నమ్ముతున్నాను. నా మంత్రి పదవి విషయం నా అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియదు,” అని చెప్పారు.
Kailash pilgrims : భారీ వరదలు.. కైలాస్‌యాత్ర మార్గంలో చిక్కుకున్న 413 మంది యాత్రికులు
అయితే ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్ రెడ్డి మూడుున్నరేళ్లు కొనసాగుతారని ఆయన అంగీకరించారు. “ఇంకా మూడున్నరేళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత ఎవరు అవుతారు అన్నది అప్పుడు నిర్ణయించుకుందాం,” అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అందరి కలిసికట్టుగా పనిచేయడం వల్లే సాధ్యమైందని ఆయన గుర్తు చేశారు. “సోషల్ మీడియా విషయానికి వస్తే, ఓడ దాటే వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు పరిస్థితి మారింది,” అని విమర్శించారు.
బిఆర్ఎస్‌పై కూడా ఆయన మండిపడ్డారు. “అధికారం కోల్పోయిన ఫ్రస్ట్రేషన్‌లో బిఆర్ఎస్ ఉంది. అసెంబ్లీకి కూడా రాని కెసిఆర్ ముందుగా తన ప్రతిపక్ష హోదా పదవికి రాజీనామా చేయాలి,” అని డిమాండ్ చేశారు.
రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత పరిస్థితులపై కొత్త చర్చకు దారితీశాయి. మంత్రి పదవి హామీ, సీఎం రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు, బిఆర్ఎస్ పై నిప్పులు చెరిగిన వ్యాఖ్యలు – ఇవన్నీ కలిపి తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ విమర్శలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
High Alert : దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులకు ఉగ్ర ముప్పు..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు