High Alert : దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులకు ఉగ్ర ముప్పు..ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (BCAS) కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రన్‌వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ఎయివియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్లు వంటి ప్రాంతాల్లోనూ అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.
- By Latha Suma Published Date - 10:22 AM, Wed - 6 August 25

High Alert : దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాలపై ఉగ్రవాద, సంఘ వ్యతిరేక శక్తుల ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు గమనించాయి. ఈ హెచ్చరికలతో కేంద్ర పౌర విమానయాన శాఖ తీవ్రంగా స్పందించింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అత్యంత అపాయం ఉన్న సమయంలో విమానాశ్రయాలు టార్గెట్ అయ్యే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేయడంతో, దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (BCAS) కీలక అడ్వైజరీ జారీ చేసింది. దేశంలోని అన్ని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. రన్‌వేలు, హెలిప్యాడ్లు, ఫ్లయింగ్ స్కూల్స్, ఎయివియేషన్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్లు వంటి ప్రాంతాల్లోనూ అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించింది.
Read Also: Renu Desai : స్టుపిడ్ పొలిటీషియన్స్..రేణు దేశాయ్ సంచలన ట్వీట్
విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. టెర్మినల్స్, పార్కింగ్ ప్రాంతాలు, ప్రీమిటర్ వలయం వంటి కీలక ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశారు. ప్రయాణికుల ప్రవేశ, లగేజ్ తనిఖీలు మరింత కఠినతరంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా, విమానాశ్రయాల రద్దీ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, లగేజ్‌లపై ప్రత్యేక నిఘా పెట్టారు. అంతేకాక, స్థానిక పోలీసు బలగాల సహకారంతో విమానాశ్రయాల వైపు వెళ్లే ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతర్జాతీయ, దేశీయంగా పంపే మెయిల్ పార్సిళ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్లు, సందర్శకులను కూడా తనిఖీలకు లోబరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ప్రయాణికులకు కీలక సూచనలూ ఇచ్చారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా లేదా లగేజ్ వదిలి వెళ్తే, వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.
ముప్పు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర ప్రతిస్పందనా బృందాలను (Emergency Response Teams) సిద్ధంగా ఉంచారు. అవసరమైతే మాక్ డ్రిల్ల్స్ నిర్వహించాలని కూడా అధికారులు సూచించారు. ఇప్పటికే పలు విమానాశ్రయాల్లో ఈ చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, కానీ ఎటువంటి అలసత్వం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ యాక్సెస్ పాయింట్లు, సిబ్బంది బేస్ ఏరియాలు, బాగేజీ హ్యాండ్లింగ్ జోన్లు వంటి ప్రాంతాల్లో నిఘా సిస్టమ్స్ మరింత పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రజల సహకారం అత్యంత కీలకం అవుతుంది. భద్రతా సిబ్బందికి పూర్తిగా సహకరించి, తనిఖీల సమయంలో సహనంతో వ్యవహరించాలని, ఉగ్రదాడుల ముప్పును త్రుటిలో తప్పించాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పౌర విమానయాన భద్రతా అధికారులు కోరుతున్నారు.
Read Also: Mega Gift : ఉదయభానుకి చిరంజీవి మెగా గిఫ్ట్ !!