Rains Alert : హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం.. ఏపీలో కూడా..
మరో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్షసూచన ఉందని వెల్లడించారు.
- By Pasha Published Date - 09:18 AM, Tue - 20 August 24

Rains Alert : హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వానలు పడుతున్నాయి. ఈనేపథ్యంలో వాతావరణ శాఖాధికారులు(Rains Alert) ఓ కీలక ప్రకటన చేశారు. మరో నాలుగు రోజుల పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్షసూచన ఉందని వెల్లడించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. సిటీలో ఓ వైపు వాన పడుతుంటే.. మరోవైపు ఉక్కపోత పెరిగిపోయింది. ముసురు పట్టడంతో హైదరాబాద్ నగరంలోని పలు ఏరియాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇళ్లలోనే ఉక్కపోతతో ప్రజలు బాధపడాల్సి వస్తోంది. వర్షం కారణంగా సిటీలోని పలు ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లింది. ఫలితంగా ఏసీలు, ఫ్యాన్‌లు లేక సోమవారం రాత్రి ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోయారు.
We’re now on WhatsApp. Click to Join
సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి హైదరాబాద్‌లోని రోడ్లు నీళ్లతో నిండిపోయాయి. దీంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ఏరియాల్లో ట్రాఫిక్ సమస్య కూడా తలెెత్తింది. నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లో రోడ్డు కూడా కనిపించనంతగా మోకాళ్ల లోతలో నీరు ఉండిపోయింది. అలాంటి ప్రాంతాల్లోని మ్యాన్‌హోళ్లలో నీరు నిలిచిపోకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ అవాంతరాల నడుమ ఇవాళ ఆఫీసులకు రాకపోకలు సాగించే వారు ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఏరియాల్లో కరెంటు కోతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎల్బీనగర్, అమీర్‌పేట, కోఠీ, జూబ్లీహిల్స్, షేక్‌పేట, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, బాలానగర్ సహా చాలా ఏరియాల్లో వాన బాగానే పడింది.
భారత వాతావరణ విభాగం తాజా ప్రకటన ప్రకారం.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆగస్టు 20 నుంచి వారం పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయి. ఇవాళ రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈరోజు సాయంత్రం ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల అతి భారీ వర్షం కురిసే సంకేతాలు ఉన్నాయి.