Rahul – Revanth : ప్రధాని పదవికి ఒక్క అడుగు దూరంలో రాహుల్‌గాంధీ : సీఎం రేవంత్
కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరు కష్టపడి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు.
- By Pasha Published Date - 01:03 PM, Mon - 8 July 24

Rahul – Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి పదవికి రాహుల్‌గాంధీ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నారని ఆయన చెప్పారు. రాహుల్ ప్రధాని కావడం నేటి చారిత్రక అవసరమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోని ప్రతి ఒక్కరు కష్టపడి.. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ చెప్పారు. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ లోక్‌సభలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రజల తరఫున మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ జయంతి సందర్బంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి(Rahul – Revanth) ఈ కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘రాహుల్‌గాంధీ పాదయాత్రకు స్ఫూర్తి వైఎస్ చేసిన పాదయాత్రే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రాహుల్‌గాంధీ పాదయాత్రే కారణం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి కృషి చేసేవారే నిజమైన వైఎస్ వారసులు. రాహుల్ గాంధీ నాయకత్వానికి వ్యతిరేకంగా వెళ్లే వారంతా వైఎస్ వారసులు కాదు’’ అని తెలంగాణ సీఎం రేవంత్(CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. ‘‘నేను గత మూడేళ్లలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. ఇవాళ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా కాంగ్రెస్ కోసం అంకితభావంతో పనిచేస్తున్న 35 మందికి కార్పొరేషన్ పదవులను ఇచ్చాం’’ అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
Also Read :Corporations Chairmens : నామినేటెడ్ పోస్టుల పండుగ.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
‘‘మన దేశంలో సంక్షేమానికి మారుపేరుగా వైఎస్సార్ పాలన చిరస్థాయిగా నిలిచిపోతుంది. వైఎస్సార్ ముద్ర పేద ప్రజల గుండెల్లో బలంగా పాతుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలకు వైఎస్సారే స్ఫూర్తి. దేశానికి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ చెబుతుండేవారు. కాలం కాటువేసిందో.. దురదృష్టం వెంటాడిందో గానీ రాహుల్ గాంధీ ప్రధాని కాకముందే వైఎస్ మనల్ని విడిచి వెళ్లిపోయారు’’ అని సీఎం రేవంత్ తెలిపారు.