Kollapur – Rahul Gandhi : కొల్లాపూర్ సభకు రాహుల్ గాంధీ.. ప్రియాంక పర్యటన రద్దు
Kollapur - Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ చివరి నిమిషంలో తెలంగాణ టూర్‌ను రద్దు చేసుకున్నారు.
- By Pasha Published Date - 03:15 PM, Tue - 31 October 23

Kollapur – Rahul Gandhi : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ చివరి నిమిషంలో తెలంగాణ టూర్‌ను రద్దు చేసుకున్నారు. అనారోగ్య కారణాలతో తాను రాలేకపోతున్నానని పేర్కొంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ప్రియాంక నుంచి సమాచారం అందినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పుడు ప్రియాంక స్థానంలో రాహుల్ గాంధీని తెలంగాణకు పంపుతోంది. ఈరోజు ప్రియాంకాగాంధీ హాజరుకావాల్సి ఉన్న కొల్లాపూర్ బహిరంగసభకు ఇక రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. కొల్లాపూర్‌లో పాలమూరు ప్రజాభేరి సభ ఈరోజు జరుగుతుంది. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరే సందర్భంగా గతంలో రెండుసార్లు సభల నిర్వహణకు ప్లాన్ చేసినా.. అనివార్య కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో కొల్లాపూర్‌లో భారీ బహిరంగసభను ఏర్పాటు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతోపాటు నవంబరు 1, 2 తేదీల్లో ప్రియాంకాగాంధీ తెలంగాణ పర్యటన కోసం రూపొందించిన షెడ్యూలులో ఎలాంటి మార్పు ఉండదని, ఆ తేదీల్లో రాహుల్ పర్యటిస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు బస చేస్తారని తెలిపాయి. ఇంతకుముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. బుధవారం జడ్చర్ల, షాద్‌నగర్, కల్వకుర్తి సెగ్మెంట్లలో రాహుల్ గాంధీ విజయభేరి బస్సు యాత్ర ఉంటుంది. గురువారం రోజు మేడ్చల్, శేరిలింగంపల్లి సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉన్నప్పటికీ వాటికి బదులుగా నల్లగొండ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్లలో పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు.