Sania Mirza – Gaza : గాజాకు నీరు, ఆహారం ఆపడం కూడా యుద్ధమా ? ఇజ్రాయెల్‌పై సానియా ఫైర్
Sania Mirza - Gaza : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న వైమానిక దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
- By Pasha Published Date - 02:36 PM, Tue - 31 October 23

Sania Mirza – Gaza : గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ చేస్తున్న వైమానిక దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 10వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20వేల మందికి గాయాలయ్యాయి. గాజాలో చనిపోయిన వారిలో సగం మందికిపైగా పిల్లలే ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సాక్షాత్తూ అమెరికా కూడా రంగంలోకి దిగి.. సామాన్యుల ప్రాణాలకు నష్టం వాటిల్లకుండా చూడాలని ఇజ్రాయెల్‌ను కోరుతోంది. ఈ దాడులపై తొలిసారి ఇండియా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా స్పందించారు. గాజాలోని సామాన్య ప్రజల కనీస అవసరాలను తీర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పేర్కొన్నారు. గాజా ప్రాంతానికి ఆహారం, నీరు, విద్యుత్ సరఫరా జరగకుండా ఇజ్రాయెల్ దేశం ఆపుతుండటం సరికాదన్నారు. గాజా ప్రజల కష్టాలు తనను కలచివేస్తున్నాయంటూ సానియా మీర్జా వాపోయారు. ఈమేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ పెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘ఎవరు ఎవరి పక్షాన ఉన్నా ఫర్వాలేదు.. కానీ అందరం కనీసం మానవత్వం పక్షాన ఉండాలి’’ అనే సందేశంతో సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక స్టోరీని పోస్ట్ చేశారు.‘‘గాజాపై ఇజ్రాయెల్ ఆర్మీ కురిపిస్తున్న బాంబుల మోత భయానకం. 23 లక్షల జనాభా ఉన్న గాజా నగరానికి ఆహారం, నీరు, విద్యుత్తు నిలిపివేయడం సమంజసమా ? బాంబు దాడులు చేస్తున్న ఇజ్రాయెల్.. గాజాలోని పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిందా ? ఈ మానవతా సంక్షోభం గురించి ప్రతి ఒక్కరు నోరువిప్పి మాట్లాడటం ఎంతో అవసరం’’ అని సానియా మీర్జా తన పోస్టులో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని అమాయక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆమె(Sania Mirza – Gaza) ఆవేదన వ్యక్తం చేశారు.