నూతన సంవత్సరం వేడుకలపై పోలీస్ కమిషనర్ సజ్జనార్ కఠిన నిబంధనలు..
పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టంగా హెచ్చరించారు.
- Author : Latha Suma
Date : 27-12-2025 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
. పబ్‌లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంటకు మూసివేత
. డ్రగ్స్ కేసుల్లోని నిందితులపై నిఘా
. కొత్త సంవత్సరం వేళ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం
Police Commissioner Sajjanar : నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే సంబంధిత సంస్థల లైసెన్సులు రద్దు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పష్టంగా హెచ్చరించారు. నిబంధనల అమలులో ఎలాంటి సడలింపులు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో హెచ్-న్యూ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, సీసీఎస్ సహా వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కమిషనర్ సమావేశమయ్యారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ..నగరంలో ‘జీరో డ్రగ్స్’ విధానమే లక్ష్యంగా కఠిన చర్యలు అమలు చేయాలని ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. నూతన సంవత్సరం వేడుకల పేరుతో డ్రగ్స్ వినియోగాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో గత రెండేళ్లలో నిందితులుగా ఉన్నవారి కదలికలపై ఇప్పటికే నిఘా పెట్టామని, డ్రగ్స్ సరఫరా చేసే వారు, వినియోగించే వారి జాబితాలను సిద్ధం చేసి వారిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ రోజు నుంచే నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు నిర్వహించే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించినట్లు కమిషనర్ వెల్లడించారు. ప్రధాన వేడుకల వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు, గెస్ట్ హౌస్‌లలో జరిగే ప్రైవేట్ పార్టీలపై కూడా గట్టి నిఘా ఉంటుందని చెప్పారు.
నగరానికి కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్కువ రద్దీ ఉండే మైత్రివనం, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్క్ వంటి ప్రాంతాల్లో భారీగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, బ్యారికేడ్లు పెట్టనున్నట్లు తెలిపారు. వాహనాల తనిఖీలు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. వేడుకలు శాంతియుతంగా, సురక్షితంగా జరిగేలా పోలీసులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి హైదరాబాద్ నగర పోలీసుల ప్రతిష్ఠను మరింత పెంచాలని సజ్జనార్ పిలుపునిచ్చారు.