Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో మరో ఇద్దరు హైకోర్టు జడ్జిల ఫోన్లూ ట్యాప్
ఆనాడు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case)లో పాల్గొన్న ప్రత్యేక ఇంటెలీజెన్స్ టీమ్‌లోని ఒక వ్యక్తి(నిందితుడు) సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) ఇటీవలే విశ్లేషించగా జడ్జీల ప్రొఫైల్స్ చిట్టా బయటపడింది.
- By Pasha Published Date - 08:48 AM, Wed - 29 January 25

Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పలువురు విపక్ష నేతలతో పాటు ఏకంగా హైకోర్టు జడ్జీల ఫోన్లనూ ట్యాపింగ్ చేసిందనే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నాడు బీఆర్ఎస్ సర్కారు ఇద్దరు హైకోర్టు జడ్జీల ఫోన్లను ట్యాప్ చేయించిందని తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో ఒక మహిళా జడ్జి ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఇద్దరు జడ్జీల సమగ్ర వివరాలతో ప్రొఫైల్స్‌ను తయారు చేసి మరీ, ఫోన్ ట్యాపింగ్ చేశారని విచారణలో తెలిసింది.
Also Read :ISRO : ఇస్రో వందో ప్రయోగం సక్సెస్.. దీని ప్రత్యేకత ఏమిటి ?
ఆ ఫోన్‌ను విశ్లేషించగా..
ఆనాడు ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case)లో పాల్గొన్న ప్రత్యేక ఇంటెలీజెన్స్ టీమ్‌లోని ఒక వ్యక్తి(నిందితుడు) సెల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) ఇటీవలే విశ్లేషించగా జడ్జీల ప్రొఫైల్స్ చిట్టా బయటపడింది. దాన్ని వెంటనే హైదరాబాద్ పోలీసులకు పంపారు. జడ్జీల ప్రొఫైల్స్‌లో వారి ఉద్యోగ ప్రస్థానం, ఫోన్ నంబర్లు, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డిటైల్ రికార్డ్స్(ఐపీడీఆర్), కుటుంబసభ్యుల వివరాలు ఉన్నాయట. ఆయా ఫోన్ నంబర్లు, ఐపీలపై తెలంగాణ స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్‌డీ ప్రభాకర్‌రావు సారథ్యంలోని ప్రత్యేక టీమ్ నిఘా పెట్టిందట. ఆ జడ్జీల వాయిస్‌కాల్స్, మెసేజ్‌లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈ-మెయిల్, చాట్, వాయిస్ ఓవర్‌ల సమాచారాన్ని కూడా ఇంటెలీజెన్స్ టీమ్ ట్రాక్ చేసిందట.
Also Read :Mahakumbh Mela Stampede : కుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి..?
హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ఫోన్లపై నిఘా
తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటైన వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు మొదలైంది. ఒక హైకోర్టు జడ్జితోపాటు ఆయన భార్య ప్రొఫైల్‌ను రూపొందించి వారి సెల్‌ఫోన్లపై నిఘా ఉంచారని గతంలో గుర్తించారు. అప్పట్లో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టింది. ఇక బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుత త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఇటీవలే వెలుగు చూసింది. దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఈ వ్యవహారంలో బాధితులుగా ఉన్నవారి యావత్ సమాచారం బయటికి వస్తోంది.