ISRO : ఇస్రో వందో ప్రయోగం.. దీని ప్రత్యేకత ఏమిటి ?
ఈ ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో(ISRO) ఛైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు.
- By Pasha Published Date - 07:52 AM, Wed - 29 January 25

ISRO : భారతదేశ సత్తాను ఇస్రో మరోసారి ప్రపంచానికి చాటింది. వందో ప్రయోగంలోనూ విజయాన్ని సాధించింది. ఎన్‌వీఎస్-02 నావిగేషన్ శాటిలైట్‌తో కూడిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్15 రాకెట్‌ను శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన తర్వాత, దాని నుంచి విడివడిన ఎన్‌వీఎస్-02 ఉపగ్రహం విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది. ఇస్రో అధిపతిగా బాధ్యతలు చేపట్టిన వి.నారాయణన్‌కు ఇది మొదటి ఉపగ్రహ ప్రయోగం. అందువల్ల ఈ ప్రయోగంలోని దీన్ని దశలను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో(ISRO) ఛైర్మన్ నారాయణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చేపట్టిన తొలి ప్రయోగం విజయవంతమైందని వెల్లడించారు. ఈ ప్రయోగం మైలురాయిగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ‘‘1979లో అబ్దుల్ కలాం నేతృత్వంలో శ్రీహరికోట వేదికగా ఇస్రో తొలి లాంచ్ వెహికిల్ ప్రయోగం జరిగింది. ఇప్పటివరకు ఇక్కడి నుంచి 100 ప్రయోగాలు జరిగాయి. 100 ప్రయోగాల్లో 548 శాటిలైట్లను కక్ష్యలోకి పంపాం. 3 చంద్రయాన్, మాస్ ఆర్బిటర్, ఆదిత్య, ఎస్‌ఆర్‌ఈ మిషన్లు చేపట్టాం’’ అని నారాయణన్ వెల్లడించారు. ఇప్పటి వరకు 6 జనరేషన్ల లాంచ్ వెహికిల్స్‌ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
Also Read :Mahakumbh Mela Stampede : కుంభమేళాలో తొక్కిసలాట.. 15 మంది మృతి..?
ఏమిటీ ఎన్‌వీఎస్-02 ?
- ఎన్‌వీఎస్-02 అనేది నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థతో కూడిన శాటిలైట్.
- దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
- దీని బరువు 2,250 కిలోలు.
- భారతదేశం అభివృద్ధి చేసిన కొత్తతరం నావిగేషన్ ఉపగ్రహాల్లో ఇది రెండోది.
- ఎన్‌వీఎస్-02 శాటిలైట్ అనేది భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్ సేవలకు ఉపయోగపడుతుంది.
- వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలను ఈ శాటిలైట్ అందిస్తుంది.
- ఈ ఉపగ్రహం పదేళ్ల పాటు సేవలు అందిస్తుంది.
Also Read :UPI Transaction IDs : ఫిబ్రవరి 1 నుంచి ఆ యూపీఐ లావాదేవీలు బంద్.. ఎందుకు ?
మన దేశానికి ప్రయోజనం ఏమిటి ?
- ఎన్‌వీఎస్-02 శాటిలైట్ మన దేశ విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా భారత్‌తో పాటు భారత్ సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకూ కచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
- గతంలో ఈ టెక్నాలజీ కోసం మనదేశం రష్యాపై ఆధారపడేది. ఇకపై ఆ అవసరం ఉండదు.
- ‘నావిక్’ అనేది భారతదేశానికి చెందిన సొంత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీని సిగ్నళ్లను రిసీవ్ చేసుకునే రిసీవర్లు ఇప్పటివరకు చాలా పెద్ద సైజులో ఉండేవి. ఇకపై చిన్నపాటి చిప్ లెవెల్ పరికరాలు కూడా ‘నావిక్’ సిగ్నల్స్‌ను రిసీవ్ చేసుకునే సామర్థ్యాన్ని పొందుతాయి.
- స్మార్ట్ వాచ్ లాంటి వాటిలో కూడా నావిక్ వ్యవస్థను వాడొచ్చు.
- గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ పనిచేయడంలో అటామిక్ క్లాక్ చాలా ముఖ్యమైంది. దాని విషయంలో భారత్ మరింత స్వయం సమృద్ధి సాధించింది.
శ్రీహరికోట నుంచే ఎందుకు చేస్తారు ?
- భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకన్‌కు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. రాకెట్‌కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసొస్తుంది.
- శ్రీహరికోటకు చుట్టూ సముద్రం ఉంది. అందువల్ల అనుకోని కారణాలతో ప్రయోగం విఫలమై రాకెట్ కూలితే సముద్రంలో పడుతుంది.
- శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. అక్టోబర్, నవంబర్‌లో మాత్రమే ఇక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
- రాకెట్ ప్రయోగం సమయంలో భూమి కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా శ్రీహరికోటలో భూమి రాళ్లతో ధృడంగా ఉంటుంది.