Nikhat Zareen : తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నిఖత్ జరీన్
Nikhat Zareen : తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్‌కు నిరాశే ఎదురైంది.
- By Latha Suma Published Date - 02:55 PM, Thu - 24 October 24

Telangana Government : భారత బాక్సర్ నిఖత్ జరీన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. తన ప్రతిభను గుర్తించి డిప్యూటీ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పోస్ట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంది. క్రీడాకారులను ప్రభుత్వం ఇలా ప్రోత్సహిస్తే తనలాగే మరికొంత మంది కూడా ముందుకు వస్తారని పేర్కొంది. కాగా, తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్‌కు నిరాశే ఎదురైంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. ప్రాథమిక దశలోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన వూ యు చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.
అయితే, ప్రపంచ వేదికలపై సత్తా చాటిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ ప్రభుత్వం అభినందించడంతో పాటు డీఎస్పీగా పోస్టు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన నిఖత్ మాట్లాడుతూ.. హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో బాక్సింగ్ అకాడమీ లేకపోవడం బాధాకరమని పేర్కొంది. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్ననిఖత్.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.
”తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. త్వరలోనే డీఎస్పీ ట్రైనింగ్ తీసుకుంటాను. డీజీపీ జితేందర్ గారు ట్రైనింగ్ సమాచారం ఇస్తామని చెప్పారు” అని నిఖత్ తెలిపింది. ఇక ప్యారిస్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందన్న నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా నిఖత్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2024 సాధించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు సైతం ప్రభుత్వం డీఎస్పీ పోస్ట్ ఇచ్చింది.
Read Also: CM Chandrababu : నేషనల్ హైవే ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం